లేపాక్షి టూరిజం గెస్ట్ హౌస్‌ను ప్రయివేటు వ్యక్తులకు ఇస్తే ఆందోళన
లేపాక్షి : మండల కేంద్రం లోని టూరిజం గెస్ట్ హౌస్ నిర్వహణ ప్రయివేటు వ్యక్తులకు ఇస్తే ఆందోళనకు దిగుతామని టిడిపి నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు వారు శనివారం స్థానిక టూరిజం గెస్ట్‌హౌస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ లేపాక్షి టూరిజం గెస్ట్‌హౌస్ లాభాల బాటలో ఉందన్నారు. దీనిని ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇవ్వాలని ప్రభుత్వం టెండర్ పిలవటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్న కృషితో ఇక్కడ గెస్ట్‌హౌస్‌ను ఏర్పాటు చేశారన్నారు. యాత్రికులకు భోజనాలు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేసి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వ ఉద్యోగులు నడుపుతున్నారన్నారు. అయితే లాభల్లో ఉన్నదానిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవవటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈసందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ బసంత్‌కుమార్‌కు సమర్పించారు. స్పందించిన కలెక్టర్ ఈ విషయం తన పరిధిలో లేదని విషయాన్ని ఉన్నతధికారుల దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అంబికా లక్ష్మినారాయణ, రామాంజినమ్మ, నాగరాజు, లేపాక్షి నాయకులు జయప్ప, సిరివరం కిష్టప్ప, నాగలింగారెడ్డి, ఆనంద్, జయకృష్ణరెడ్డి, మారుతి ప్రసాద్, అంజినప్ప, అభి, శ్రీరామిరెడ్డి, మాలక్క, రవి తదితరులు పాల్గొన్నారు.










