Nov 27,2022 21:42

సమ్మేళన సభలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : కురుబలు ఐక్యంగా అన్ని రంగాల్లో రాణించి ముందుకు సాగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సాయి ఆరామంలో సత్యసాయి జిల్లా కురుబల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అంతకుమునుపు హనుమాన్‌ సర్కిల్‌ నుంచి భారీ సంఖ్యలో కురుబలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాయి ఆరామంలో భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సామకోటి ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పెనుకొండ శాసనసభ్యుడు మాలగుండ్ల శంకర్‌ నారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే, టిడిపి జిల్లా అధ్యక్షుడు బికె పార్థసారథి, మాజీ కురుబ కార్పొరేషన్‌ చైర్మన్‌ సవితమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కురుబ సంఘం జిల్లా కమిటీని ఏర్పాటు చేసి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో కళ్యాణ మండపం, విద్యార్థులకు వసతిగృహం నిర్మించాలన్నారు. జిల్లాలో సుమారు 2.50 లక్షల కురుబ ఓటర్లు ఉన్నారన్నారు. కురుబలను అన్ని పార్టీలు గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా ఎదగాలంటే కురుబలంతా ఒక తాటిపై నడవాలన్నారు. ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ మాట్లాడుతూ రాజకీయంగా కురుబలకు ప్రాధాన్యత ఇచ్చింది వైసీపీ నేనని చెప్పగా, కురుబలు పెద్ద ఎత్తున అడ్డు తగిలారు. రాజకీయాలు మాట్లాడవద్దని కేకలు వేశారు. బి కె పార్థసారథి, సవితమ్మ సర్ది చెప్పడంతో సద్దు మునిగింది. ఎంపీ గోరంట్ల మాధవ్‌ కూడా వైసిపి కురుబలకు పెద్దపీట వేసిందని అనగానే సభలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. పార్థసారథి, సబితమ్మ మాట్లాడుతూ కురుబలు ఐక్యంగా తమ సంఘటిత శక్తిని నిరూపించుకోవాలన్నారు. కురుబల కళ్యాణ మండపానికి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి అధికార పార్టీ నాయకులు చర్యలు తీసుకోవాలన్నారు. కళ్యాణ మండపానికి గోరంట్ల మాధవ్‌ తన ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరు మంజూరు చేయిస్తానని ప్రకటించగా, శంకర్‌ నారాయణ 10 లక్షలు ప్రకటించారు. ఈ సమావేశంలో కురుబ సంఘం నాయకులు కెటి. శ్రీధర్‌, మల్లికార్జున, కురుబ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోటిబాబు, బోరంపల్లి ఆంజనేయులు, కమ్మన్న, శివానంద, మాధవప్ప, కాటమయ్య, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.