'అపాయమ్ము దాటుటకు.. ఉపాయమ్ము కావాలి/ అంధకారం అలిమినపుడు.. వెలుతురుకై వెదకాలి/ ముందు చూపు లేని వాడు.. ఎందులకు కొరగాడు/ సోమరియై కునుకువాడు... సూక్ష్మమ్ము గ్రహింపలేడు' అంటారు ప్రముఖ సినీ రచయిత కొసరాజు. సోమరితనంతో, నిద్రలేమితో కునుకువాడు, నిద్రమత్తులో జోగువాడు మంచిచెడులను గుర్తించలేడు. జీవితంలో సగభాగం నిద్రతోను, మిగతా సగభాగం సోమరితనంతోనూ గడిపేవాడు తనకు తానే భారంగా మిగులుతాడు. ముందుచూపు వున్నవారు... నిద్రాహారాలు మానినా.... ఒక ఆశయం కోసం పనిచేస్తారు. ఏదోక అద్భుతాన్ని ఆవిష్కరించగలుగుతారు. కొన్నిసార్లు మెలకువగా వుండాల్సిన అవసరాలూ వస్తుంటాయి. కానీ, అవి పరిమితంగానే వుంటాయి. నిద్ర వలన శరీరానికి, మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దానితో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి అభివృద్ధి అవుతుంది. సహజమైన నిద్ర మెదడుకు చురుకుదనాన్ని, శారీరకంగా, మానసికంగా ఉత్తేజాన్ని ఇస్తుంది. అయితే ఈ నిద్రకు కూడా కొన్ని పరిమితులున్నాయి. ఎక్కువగా నిద్రపోయినా సమస్యలు తప్పవు. తక్కువగా నిద్రపోయినా సమస్యలు వస్తాయి. అందుకే 'వేళకు తగినంత నిద్రపోవాలి' అని పెద్దలంటుంటారు. 'మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరమని, శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనదని, నిద్ర పౌరుల ప్రాథమిక హక్కని, ఆరోగ్యవంతమైన జీవనానికి నిద్ర చాలా అవసరమైనద'ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కేరళలోని తిరుచ్చూర్‌కు చెందిన శ్రీకుమార్ అనే మావటి పెంచుకుంటున్న ఏనుగు... నిద్రపోకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండేది. అనేక ప్రయత్నాల అనంతరం వైద్యులకు చూపించాడు. అయినా నయం కాలేదు. చివరకు ఇళయరాజా స్వరపరిచిన ''అల్లీలమ్ పూవో'' అనే పాటను పాడి ఆ ఏనుగును నిద్రపుచ్చగలిగాడు. ఆ పాటని వింటూ మెల్లగా నిద్రలోకి జారుకుంది ఏనుగు. వినసొంపైన సంగీతానికి జంతువులు సైతం నిద్రలోకి జారుకుంటాయని నెట్‌లో ట్రెండ్ అవుతోన్న ఈ వీడియో చూస్తే... 'శిశుర్వేత్తి పశుర్వేత్తి' అనే మాటలు గుర్తురాక మానవు. 'సర్వంసహా చక్రవర్తి హంసతూలికా తల్పం మీద పడుకున్న నిద్ర... పక్కనే కటికనేల మీద ఆయన బంటు పడుకున్న నిద్ర- రెండూ ఒకటే' అంటాడు అన్నమయ్య. కనురెప్ప పడినంత సహజంగా, వేగంగా నిద్ర పట్టాలి. కానీ, ఇది చెప్పినంత సులభం కాదు. కొందరు నిద్రకోసం తపస్సు చేయాల్సినంత పనవుతుంది. పుస్తకాలనో, సంగీతాన్నో ఆశ్రయించడం ద్వారా నిద్రలోకి జారుకుంటారు మరికొందరు. నిద్రలేమి కొందరికి మానసిక సమస్య. ఇటీవలి కాలంలో ఈ సమస్య యువతను పట్టి పీడిస్తోంది. వృత్తిరీత్యా నిద్రకు దూరమయ్యే వారు కొందరైతే, ఇరవై నాలుగ్గంటలూ సోషల్ మీడియాలోనో, మొబైల్ ఫోన్లతోనో గడిపేస్తూ... నిద్రకు దూరం అవుతున్నారు ఇంకొందరు. చివరకు ఈ నిద్రలేమి మానసిక సమస్యగా మారుతోంది. 'కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది/ కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది' అంటూ తన పాటలో శాస్త్రీయతను జోడించాడు ఆత్రేయ. కానీ, అసలు నిద్ర నుంచే చాలామంది చాలా దూరం జరిగిపోతున్నారు.
మనోవ్యథ, శారీరక బాధల నుంచి సేదతీర్చేది నిద్ర ఒక్కటే. ప్రశాంతమైన నిద్ర దివ్య ఔషధం అంటా నిపుణులు. హాయిగా నిద్రపోయినవారు ఆరోగ్యంగా ఉంటారని అనేక పరిశోధనల్లో వెల్లడయ్యింది. ప్రతీ పది మందిలో ముగ్గురు నిద్రలేమితో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగుల్లో కూడా పది మందిలో ముగ్గురు నిద్ర సమస్యలతో బాధపడుతున్నారని, సరిగా నిద్రలేనివారికి కూడా కోవిడ్ సోకిందని పరిశోధనలు చెబుతున్నాయి. సహజంగా ఎవరైనా 8 గంటలు నిద్రపోతే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోయినా అది అనారోగ్యానికి దారితీస్తుంది. రోజుకు 8 గంటల కంటే తక్కువ నిద్ర పోయే వారిలో శారీరక సామర్ధ్యం తక్కువగా ఉంటుందని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధన వెల్లడిస్తోంది. తగినంత సమయం నిద్రించడం ఆరోగ్యానికి మంచిది. మంచి ఆరోగ్యవంతమైన యువత దేశ భవితకు మంచిది. ప్రతి ఏడాది మార్చి నెల మూడో శుక్రవారం 'ప్రపంచ నిద్ర దినోత్సవం' జరుపుకుంటున్నారు. రోజుల పసికందు నుంచి పండు వృద్ధుల వరకు నిద్ర అత్యంత అవసరమని ఈ రోజు గుర్తు చేస్తుంటుంది.










