Apr 08,2023 20:25

కస్తూర్బా బాలికల పాఠశాలలో వంట గ్యాస్‌ లీక్‌

వీరబల్లిమ : కస్తూర్బా బాలికల పాఠశాలలో శనివారం ఉదయం 10 గంటల సమయంలో వంట చేస్తుండగా గ్యాస్‌ లీక్‌ కావడంతో మంటలు అంటుకున్నాయి. అక్కడ పనిచేస్తున్న వంట సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. అదే సమయంలో 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన రాయచోటి ఉప విధ్యాశాధికారి వరలక్ష్మి, వీరబల్లి ఎంఇఒ గిరి వరదయ్య అక్కడికి వెళ్లారు. కస్తూర్బా విద్యార్థుల కోసం వంట తయారు చేస్తున్న సమయంలో గ్యాస్‌ సిలిండర్‌ స్టౌకు మధ్య ఉన్న పైపు పగలడంతో గ్యాస్‌ లీకై మంటలు ఎగిసి పడ్డాయి. అక్కడే పోలీసు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కరెంటు సరఫరా తొలగించి, మంటలు అర్పే ప్రయత్నించారు. మంటలు అదుపులోనికి రాలేదు. సమీపంలో ఉన్న సిలిండర్లను ఎంఇఒ గిరివరదయ్య బయటకు తెచ్చారు. సిఐ లింగప్పకు విషయం తెలియడంతో ఆయన అప్రమత్తమై వెంటనే పైఅంతస్తులో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధులందరినీ బయటకు తీసుకొచ్చి వంట గదిలోకి వెళ్లి గ్యాస్‌కు ఉన్న రెగ్యులేటర్‌ను ఆర్పివేడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. సమాచారం అందుకున్న అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం వెంటనే వీరబల్లి కస్తూర్బా బాలికల విద్యాలయం పరీక్షా కేంద్రాన్ని, గ్యాస్‌ లీకైన సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కారాదని పాఠశాల ప్రత్యేక అధికారి కుసుమను హెచ్చరించారు. విద్యార్ధులు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. కార్యక్రమంలో వీరబల్లి ఎస్‌ఐ రహీముల్లా పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
- మాట్లాడుతున్న డిఇఒ పురుషోత్తం సిఐ లింగప్ప