మానకొండూర్ (కరీంనగర్) : కరీంనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ గొడవల నేపథ్యంలో.. కట్టుకున్న భార్యను పిల్లనిచ్చిన మామను వెంటాడిమరీ హత్య చేసిన ఘటన సోమవారం రాత్రి కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్ గుట్ట సమీపంలో జరిగింది.
స్థానిక వివరాల మేరకు... వెల్దికి గ్రామానికి చెందిన లావణ్య (34), అన్నారానికి చెందిన గుడాల రమేశ్ కు వివాహమయ్యింది. రమేశ్ ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మనస్పర్థలు రావడంతో గత రెండు నెలలుగా భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉంటున్నారు. గొడవల నేపథ్యంలో... పుట్టింటిలో ఉంటున్న లావణ్య తన భర్తపై కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు భార్యాభర్తలిద్దరినీ పిలిచి నచ్చజెప్పారు. దీంతో రమేశ్ మనస్తాపం చెందాడు. నిన్న రాత్రి భార్య లావణ్య, మామ ఓదేలు (60), కుమారుడు అజిత్, కుమార్తె అక్షిత లు ఆటోలో వెల్దికి వస్తుండగా... రమేశ్, అతని సోదరుడు అనిల్‌తో కలిసి బైక్‌పై వారిని వెంబడించారు. దారిలో ఆటోను ఆపి భార్య, మామపై దాడిచేసి కత్తితో గొంతు కోశారు. తీవ్ర రక్తస్రావమయ్యి వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దాడిని అడ్డుకోబోయిన కుమార్తె చేతికి గాయమైంది. అనంతరం నిందితులిద్దరూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లంగిపోయారు. మృతి చెందిన మామ ఓదేలు సింగరేణి విశ్రాంత ఉద్యోగి. ఎసిపి విజయసారథి, సిఐ కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.










