కర్ణాటక ఎన్నికలే బిజెపి పతనానికి నాంది : కర్ణాటక ఎన్నికలే బిజెపి పతనానికి నాంది :
కాంగ్రెస్‌ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్
ప్రజావ్యతిరేక విధానాలను ఆవలంభిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పతనానికి కర్ణాటక ఎన్నికలే నాంది కావాలని అన్నమయ్య జిల్లా, మదనపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్.రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి పాలనలో దేశప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారన్నారు. ముఖ్యంగా నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయని, దీంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని వాపోయారు. జిఎస్‌టి రూపంలో లక్షల కోట్లు వసూలు చేస్తున్నారని, ఈ ధనాన్ని ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దేశ సంపదను కార్పొరేటర్లకు దోచిపెట్టడమే బిజెపి విధానమని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిన వారిపై ఈడీ, సిబిఐల చేత విచారణ పేరిట తప్పుడు కేసులు పెట్టి వారిని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జిఎస్‌టి ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ చెప్పడం హర్షణీయమన్నారు. అదేవిధంగా త్వరలో కర్ణాటకలో జరుగబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర నుంచి వలస వెళ్లిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు. బిజెపి ఎన్ని కుతంత్రాలు పన్నినా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో అరాచకాలు, దౌర్జన్యాలు మితిమీరి పోయాయన్నారు. ప్రజలు ఇబ్బందులు తొలగాలంటే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మహబూబ్ పీర్, జీవన్ కుమార్ పాల్గొన్నారు.










