ప్రజాశక్తి - పులివెందుల టౌన్ : రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో ఆదివారం పులివెందులలోని సిఎస్‌ఐ చర్చిలో తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన కూటమిలో జగన్ పాల్గొన్నారు. అనంతరం సిఎస్‌ఐ చర్చిలో తల్లి విజయమ్మతో కలిసి క్రిస్మస్ కేకు కట్ చేశారు. జగన్‌కు తల్లి విజయమ్మ కేక్‌ను తినిపించారు. సిఎస్‌ఐ చర్చి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రార్థనా కూటములు ముగిసిన అనంతరం చర్చిలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ పండుగ వేడుకలో పాల్గొన్న జగన్ బంధువులు, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ రోజున ప్రతి ఏడాది తన సొంత గడ్డపై ఇదే చర్చిలో కుటుంబ సభ్యులు, బంధుగణం, స్నేహితులతో కలిసి పండుగ వేడుకలో పాల్గొనడం తన మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జగన్ సతీమణి వైఎస్.భారతి, తల్లి విజయమ్మ, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్.భాస్కర్‌రెడ్డి, వైఎస్.ప్రకాశ్‌రెడ్డి, భారతమ్మ, సత్యవతమ్మ, మాధవీలత, ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాధ్‌రెడ్డి,కలెక్టర్ వి.విజరు రామరాజు, ఎస్‌పి అన్బురాజన్, ఏఎస్పీ తుషార్ డూడీ, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పాల్గొన్నారు. సిఎస్‌ఐ చర్చిలో ప్రార్ధనా కూటములు ముగించుకొని భాకారపురం హెలిప్యాడ్ నుంచి కడపకు చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.










