అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట వేరుశనగ. అయితే ఈ పంటకు అవసరమైన నూతన వంగడాలు సకాలంలో అందుబాటులోకి రావడం లేదు. వేసిన రకమే వేస్తూ పోవడం మూలంగా పంటల దిగుబడులపైనా ప్రభావం పడుతోందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పంట దిగుబడులు క్రమంగా తగ్గుతూపోవడంతో రైతులు ఆ పంట సాగుపైనే ఆసక్తి చూపే పరిస్థితి లేకుండాపోతోంది. ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 16 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట సాధారణంగా సాగయ్యేది అది ఇప్పుడు పది లక్షల ఎకరాల్లోపు వచ్చేసింది. ఈ పంటలకు ప్రధానమైన సమస్య విత్తనంలో కొత్త రకాలు ఇతర వాటిల్లో అంతగా రావడం లేదు. దశాబ్ధకాలానికి ఒక కొత్త రకం కూడా అందుబాటులో ఉండటం లేదు. దీంతో రైతులు వేసిన పంట రకాలనే వేస్తూ పోవాల్సిన వస్తోంది. 1980వ దశకం నుంచి 2005 వరకు కూడా దాదాపు మూడు దశబ్ధాల వరకు జిల్లాను శాసించినది టిఎంవి-2 అనే రకం ఒక్కటే. అది వేసివేసి దిగుబడులు తగ్గిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఆ తరువాత కదిరి-6 రకం అందుబాటులోకి వచ్చింది. 2005 తరువాత అందుబాటులోకి వచ్చిన ఈ రకం కూడా 2015లో రీనోటిఫై చేసే రైతులకు అందజేస్తున్నారు. ఇది క్రమంగా దిగుబడి తగ్గుతూవస్తోంది. కొత్త రకాల కోసం రైతులు సైతం ఎదురు చూస్తున్నారు. ఇటీవలనే కెఎల్1812 రకాన్ని (కదిరి లేపాక్షి) రకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ రకంపై ఆదిలోనే రైతుల నుంచి విముఖత వ్యక్తమవుతోంది.
కెఎల్ 1812పై నిరాసక్తత
కదిరి-6 స్థానంలో కెఎల్1812 రకాన్ని కదిరి వ్యవసాయ పరిశోధాన క్షేత్రం నుంచి తీసుకొచ్చారు. ఇది అటు బెట్ట, అధిక వర్షాలు రెండింటికీ తట్టుకుని నిలబడుతుందని భావించారు. అంతేకాకుండా నూనె కె-6లో 48 శాతముంటే ఇందులో 51 శాతముంటుందని భావించారు. పల్లిని తిన్న సమయంలో కాస్త చేదు వస్తోంది. ఈ ఒక్క ప్రతికూలతతో ఈ పంట సాగుపై రైతులు వెనుకడుగు వేస్తున్నారు. లేకపోతే అంతకు మునుపు ఏడాది ఈ రకం విత్తనం కోసం రైతులు పెద్దఎత్తునే పోటీపడ్డారు. క్వింటా రూ.22 వేల వరకు ధర పలికింది. గత ఖరీఫ్ నుంచి ఈ పంట సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. గత ఖరీఫ్‌లో 2.30 లక్షల క్వింటాళ్లు సబ్సిడీపై ఇస్తే అందులో 40 వేల క్వింటాళ్లు ఏపీ సీడ్స్ వద్ద మిగిలిపోయాయి. ఇందులో 25 వేల క్వింటాళ్లు కెఎల్ 1812 రకముంటే మూడు వేల క్వింటాళ్లు మాత్రమే రైతులు తీసుకున్నారు. ఇక రబీలో అయితే ఇప్పటి వరకు 32 క్వింటాళ్లు మాత్రమే తీసుకున్నారు. తీసుకోవడానికి రైతులు ముందుకు రావడడం లేదు.
టిసిజిఎస్ 1694 అయినా సక్సెస్ అయ్యేనా..?
ఇప్పుడు తిరుపతి రకాన్ని తిరుపతి వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో కొత్తగా రూపొందించారు. ఇప్పుడు ఈ రకం సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. మంచి దిగుబడులే ఇస్తున్నట్టు రైతులు భావిస్తున్నారు. అయితే ఇంకా ఇది ప్రాథమిక దశలోనే ఉంది. ప్రభుత్వం వైపు నుంచి కూడా నోటిఫై అవ్వాల్సి ఉంది. నోటిఫై అయి పెద్ద స్థాయిలో సాగులోకి వస్తేగాని ఇందులో అనుకూలత, ప్రతికూలతపై స్పష్టత వచ్చే పరిస్థితి లేదు. మొత్తంగా వేరుశనగ సాగులో పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా దిగుబడులు పెరిగే కొత్త రకాలు అందుబాటులోకి రావడం లేదన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. దిగుబడులు పెరిగే మంచి రకాలు ఎప్పటికప్పుడు అందుబాటులోకి రాకపోతే వేరుశనగ సాగు జిల్లాలో కష్టసాధ్యమవుతుందని వ్యవసాయ నిపుణులు సైతం చెబుతున్నారు.










