ప్రజాశక్తి - రాయచోటి: చైనాలో కోవిడ్-19 విజంభిస్తున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని, ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ గిరీష వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ విసి హాల్‌లో కోవిడ్‌పై తీసుకోవాల్సిన ముందుస్తు జాగ్రత్తలపై వైద్య సిబ్బందితో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాలను దష్టిలో ఉంచుకుని, అప్రమత్తంగా ఉండాలని కోవిడ్ నివారణకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. కోవిడ్ రోగుల అడ్మిషన్స్ పెరిగితే బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సరిపడ ఐసియు బెడ్లు, నాన్ ఐసియు బెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు చర్యలు తీసుకోవాలని డిసిహెచ్‌ఎస్ డాక్టర్ చంద్రశేఖర్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా గతంలో కోవిడ్ ఆసుపత్రులుగా గుర్తించిన అన్ని ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, మ్యాన్ పవర్ సమద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్ని పిఎస్‌ఎ ప్లాంట్లున్నాయి, సిద్ధంగా ఉన్నాయా లేవా అని ఒకసారి సరి చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మాస్క్‌లు, శానిటైజర్‌లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, డీటైప్ సిలెండర్లు, మందులు తగినన్ని నిల్వ ఉంచుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టెస్టింగ్, వాక్సినేషన్‌పై కూడా దష్టి పెట్టాలని సూచించారు. రేపటి రోజు ప్రక్రియలపై మాక్ డ్రిల్ నిర్వహించాలని, ఏమైనా లేకపోతే వాటిని సమకూర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి సిహెచ్‌సిలో ఐదు ఐసోలేషన్ బెడ్లు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్ కొండయ్య, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ డిఎంహెచ్‌ఒలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










