Apr 02,2023 21:07

కోదండరాముని కల్యాణానికి విస్తత ఏర్పాట్లు

ఒంటిమిట్ట : శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 5న ఒంటమిట్టలో శ్రీసీతారాముల కల్యాణానికి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి ఇఒ ఎ.వి. ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కడప జిల్లా కలెక్టర్‌ విజరురామరాజుతో కలసి ఆయన కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. విబాగాల వారిగా జరుగుతున్న పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఇఒ మాట్లాడుతూ కల్యాణం రోజున ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. కల్యాణ వేదిక వద్ద భక్తులు గ్యాలరీల్లోకి ప్రవేశించే ముందే ముత్యంతో కూడిన తలంబ్రాలు, పసుపు కుంకుమ, అన్నప్రసాదం ప్యాకెట్‌ అందజేస్తామని చెప్పారు. భక్తులు ఎలాంటి తొందరపాటు లేకుండా వీటిని స్వీకరించి సంతృప్తికరంగా కల్యాణాన్ని దర్శించుకోవాలని కోరారు. ప్రజల కోసం మజ్జిగప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో టిటిడి జెఇఒ వీరబ్రహ్మం, ఎస్‌విబిసి సిఇఒ షణ్ముక్‌కుమార్‌, టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2 జగదీశ్వర్‌రెడ్డి, విద్యుత్‌ ఎస్‌ఇ వెంకటేశ్వర్లు, విజిఒ మనోహర్‌, డిప్యూటీ ఇఒలు నటేష్‌బాబు, సుబ్రహ్మణ్యం, గోవిందరాజన్‌, లోకనాధం, గుణభూషణ్‌రెడ్డి, అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ పాల్గొన్నారు.
కల్యాణం ఏర్పాట్లపై చర్చిస్తున్న టిటిడి ఇఒ, కలెక్టర్‌