- కలగా మిగిలిన 'కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్'
- ఏళ్లు దాటుతున్నా ముందుకు పడని అడుగు
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : కాకినాడలో పెట్రో కెమికల్ కారిడార్ కలగానే మిగిలిపోతోంది. దీనివైపు కేంద్రం కన్నెత్తి కూడా చూడట్లేదు. పెట్రో కెమికల్ కారిడార్‌ను కాకినాడలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగానే ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ గతేడాది జూన్ 16న ప్రకటించారు. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్‌్) సర్దుబాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొస్తేనే కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం సాధ్యమవుతుందని పెట్రోలియ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి డిసెంబరు ఆరున స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో కాకినాడ సెజ్‌లో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దీని ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌పిసిఎల్, గెయిల్‌తో 2017 జనవరిలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.25 వేల కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆ సమయంలో చెప్పుకొచ్చారు. రాబోయే రెండు, మూడేళ్లలో పెట్రో కెమికల్ రంగంలో పెట్టుబడులు పుంజు కుంటాయని, ఈస్ట్ కోస్ట్ కారిడార్లో రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకూ పెట్టుబడులు వస్తాయని ఆశలు కల్పించారు. దీని అనుబంధ పరిశ్రమలతో కలుపుకొంటే మొత్తం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది. దీంతో, ప్రాజెక్టును వేగంగా పట్టాలు ఎక్కించడానికి కాకినాడ సెజ్‌లో సుమారు రెండు వేల ఎకరాలను కేటాయించింది. ఇప్పటి వరకు మూడుసార్లు మట్టి నమూనాలు పరిశీలించి ప్రాజెక్టు ఏర్పాటుకు అనుకూలంగా కూడా ఉందని తేల్చారు.
కేంద్రం మొండివైఖరి
కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుపై అడుగు ముందుకు పడకపోవడానికి కేంద్ర ప్రభుత్వ వైఖరే ప్రధాన కారణం. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయడంలో బిజెపి మొండి వైఖరి అవలంభిస్తోంది. ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి కార్పొరేట్‌తోపాటు ఇతర పన్నుల కింద ఏటా రూ.975 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద కేంద్రం ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు కేంద్రాన్ని కోరారు. దీనిపై కేంద్రంలో బిజెపి సర్కారు స్పందించలేదు. దీంతో, 2017 నుంచి ఈ ప్రాజెక్టు అడుగులు ముందుకు పడలేదు. వైసిపి అధికారంలోకొచ్చిన తర్వాత ప్రత్యేక కమిటీ పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం కానరాలేదు. ఆరు నెలల క్రితం మరోసారి విజిఎఫ్ కింద ఏడాదికి రూ.975 కోట్ల చొప్పున 15 ఏళ్లపాటు సమకూర్చాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కోరింది. కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని వైసిపి నాయకులు చెబుతున్నారు.
విభజన హామీలు తక్షణం అమలు చేయాలి
విభజన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కోరుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడా లని అడుగు తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ ప్రాజెక్టును త్వరితగతిన ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.











