హైదరాబాద్ : టిపిసిసి అధ్యక్ష పగ్గాలు అందుకున్నాక రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయమై సిఎం కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు బిశ్వాల్ కమిటీ చెప్పిందని, అందులో 50 వేల పోస్టులే భర్తీ చేస్తారా? అని ప్రశ్నించారు. కార్పొరేషన్లలోని ఖాళీల భర్తీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా వేళ స్టాఫ్ నర్సులను కొనియాడారని, ప్రస్తుతం నర్సులు ప్రగతిభవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, వారి ఆవేదన కనపడట్లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,640 కుటుంబాలను కెసిఆర్ రోడ్డున పడేశారన్నారు. 2018లో ఎంపికైన ఎఎన్‌ఎం అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, స్టాఫ్ నర్సులను విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే నిరుద్యోగుల తరఫున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తమను ఆదుకోవాలని రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందించిన నర్సులకు వారి తరఫున పోరాటం చేస్తామని ఆయన భరోసా కల్పించారు.










