Aug 16,2020 07:38


వామపక్షాల ఆధ్వర్యం లోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం నయా ఉదారవాదానికి ప్రత్యామ్నాయంగా కేరళలో అమలు చేస్తున్న అభివృద్ధి నమూనాను అస్థిర పరిచేందుకు కాంగ్రెస్‌, బిజెపి కంకణం కట్టుకున్నాయి. కేరళ లోని వామపక్ష ప్రజాతంత్ర ఐక్య సంఘటన (ఎల్‌డిఎఫ్‌) పరిపాలన ఐదవ సంవత్సరం లోకి అడుగు పెట్టింది. చారిత్రకంగా రాష్ట్రం సాధించిన సామాజిక విజయాలను ఆ ప్రభుత్వం పటిష్టపరుస్తూ మరింత విస్తృతపరిచే దిశగా తన కృషిని సాగిస్తున్నది. ఆ పునాదులపై వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ఉత్పత్తిని ప్రధానంగా వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నది.
లక్ష్య సాధనలో అనేక సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఈ కాలంలో ఎవ్వరూ ఊహించని విధంగా ప్రకృతి వైపరీత్యాలు వెంటాడాయి. 2017లో ఓఖీ తుపాను, ఆ వెంటనే రెండు సంవత్సరాల పాటు (2018, 2019లో) విపరీతమైన వర్షాల కారణంగా వరదలు, విరిగిపడిన కొండ చరియలు... రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. నిఫా మహమ్మారి తన ప్రతాపం చూపిన వెంటనే కోవిడ్‌-19 రావడం ఆరోగ్య, ఆర్థిక రంగాలలో సంక్షోభానికి కారణం అయింది.
ప్రతిబంధకాల నడుమనే అభివృద్ధి
ప్రతిపక్షం లోని కాంగ్రెస్‌, బిజెపి లు అక్కడ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి విస్తృతంగా విష ప్రచారానికి పూనుకున్నాయి. వామపక్షాల నాయకత్వంలో అక్కడ ప్రజలను భాగస్వామ్యం చేసి సాధిస్తున్న విజయాలను తక్కువ చేసి చూపడమే ఆ ప్రచార అసలు లక్ష్యంగా కనబడుతున్నది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సంవత్సరం లోపు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కలిగిస్తున్నా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం వాటిని అధిగమిస్తూ నయా ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నాయంగా అమలు చేస్తున్న అభివృద్ధి నమూనాను పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షాలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయి.
ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఆర్థిక లోటును వారసత్వంగా పొందింది. రాష్ట్రంలో రెవెన్యూ రాబడి తక్కువగా ఉండేది. రాజ్యాంగంలో పేర్కొన్నదాని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన అధికారాలు, ఆర్థిక వనరుల పంపిణీ...రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వనరుల సామర్థ్యం, తప్పనిసరి ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసాన్ని సృష్టించింది. 1991 నుంచి దేశంలో అమలవుతున్న నయా ఉదారవాద విధానాల ఫలితంగా రాష్ట్రాల స్థాయిలో ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను అమలుచేయడం కష్టతరంగా మారింది.
కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణలో భాగంగా...రాష్ట్రాలు అప్పులు చేసే పరిమితిని తగ్గించింది. రెండోది జిఎస్‌టి అమలుతో కేంద్రం నుంచి రాష్ట్రాలు పొందాల్సిన ఆదాయాన్ని అందించడంలో జరుగుతున్న జాప్యం వలన కేరళ ఆర్థికాభివృద్ధికి మరిన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
ఈ సవాళ్ళను ఎదుర్కొంటూనే ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అన్ని రంగాలకు సరిపడా ఆర్థిక వనరులు సమకూర్చడానికి, అభివద్ధి ఫలాలు అందరికి అందేలా చూడటానికి దఢ సంకల్పంతో ప్రయత్నించింది. ఫలితంగా అక్కడ సానుకూల ఫలితాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుత ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ పాలనా కాలంలో అభివృద్ధి 7.2 శాతంగా నమోదు అయితే, గత ప్రభుత్వ కాలంలో 4.9 శాతమే ఉండింది.
ప్రజానుకూల విధానాలు
గత నాలుగు సంవత్సరాల కాలంలో కేరళ సాధించిన అభివద్ధిని పరిశీలిద్దాం. అందుకు ఐదు ప్రధానమైన రంగాలను తీసుకుందాం. వ్యవసాయం, ప్రభుత్వ రంగ పరిశ్రమల అభివృద్ధి, సామాజిక భద్రత, పాఠశాల విద్య, మౌలిక సదుపాయాల కల్పన. వ్యవసాయంలో ఆధునీకరణ విధానాలను ప్రవేశపెట్టే శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం జరిగి అభివృద్ధి సాధించేందుకు ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది. కోవిడ్‌-19 తదుపరి కాలం కోసం 'సుభిక్షా కేరళం' అనే పథకాన్ని రూ.3680 కోట్లతో రూపకల్పన చేశారు. ఇది పునరుద్ధరణ లక్ష్యంగా సాగాల్సిన పథకం. ఆహార ధాన్యాల ఉత్పత్తిని విస్తృత పరుస్తూ త్రీవతరం చేయటం దీని లక్ష్యం. అందుకోసం వ్యవసాయం, పాడి పరిశ్రమ, పాల ఉత్పత్తి, చేపల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సాగు నీటి వనరులను అభివృద్ధి చేయడం, విలువను పెంచే విధంగా పారిశ్రామిక ఉత్పత్తులను రూపొందించి సహకారాన్ని అందించడం జరుగుతున్నది.
ఆర్థిక ప్రణాళికకు అవసరమయిన పెట్టుబడిని సమకూర్చుకోవడానికి ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్ముకునే విధానాన్ని కేరళ తిరస్కరించింది. ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్ముకోవడం అనే విధానాన్నే ప్రధాన ఆదాయ వనరుగా కేంద్ర ప్రభుత్వం, మరికొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. గత ప్రభుత్వ కాలంలో రూ.213 కోట్ల నష్టాలలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు...ఈ ప్రభుత్వ పాలన రెండేళ్ల లోనే నష్టాలను పూడ్చుకుంటూ రూ.109.91 కోట్ల లాభాలు సంపాదించాయి. 58.5 లక్షల మందికి సామాజిక భద్రత కల్పిస్తూ సంక్షేమం కోసం పెన్షన్‌ అందచేయడం ఈ ప్రభుత్వ విశిష్టత. 'ప్రతి ఒక్కరికి ఇల్లు' పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన సమీకృత జీవనోపాధి, ఆర్థిక స్వావలంబన పథకం (ఎల్‌ఐఎఫ్‌ఇ) ద్వారా చిత్తశుద్ధితో అమలు చేసి 2.5 లక్షల ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అప్పగించారు. ఈ ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యలో ఒక సంచలనం స్పష్టంగా కనబడుతున్నది. 5 లక్షల మంది విద్యార్థులు ప్రయివేటు స్కూళ్ళకు వెళ్లడం మానేసి ప్రభుత్వబడులలో అడ్మిషన్లు తీసుకోవడం అందుకు మంచి ఉదాహరణ.
మౌలిక సదుపాయాల నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టును ప్రారంభించింది. దీన్ని కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడుల ఫండ్‌ బోర్డు ఆధ్వర్యంలో అమలుచేస్తున్నారు. పర్వత ప్రాంత రహదారుల నిర్మాణం ప్రాజెక్టు రూ.3500 కోట్లతో ప్రారంభమైంది. సముద్ర తీర ప్రాంతంలో కోస్టల్‌ హైవే ప్రాజెక్టు కూడా ప్రారంభించారు. త్వరలో హైస్పీడ్‌ రైల్వే ప్రాజెక్టు ప్రారంభం కానున్నది. జాతీయ జల రవాణా పథకం పూర్తి కావచ్చింది. గ్యాస్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (జీఏఐఎల్‌) పైప్‌లైన్‌ నిర్మాణం విజయవంతంగా పూర్తయి పని చేస్తున్నది.
ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేకమైన సాంకేతిక నైపుణ్యం అవసరం. సాంకేతిక నైపుణ్యం అందించే సంస్థలను పారదర్శక పద్ధతిలో ఎంపిక చేసే పద్ధతిని కచ్చితంగా అమలు చేస్తున్నారు. అవి సమర్పించిన ప్రణాళికలను పరిశీలించేటప్పుడు రాష్ట్ర పరిస్థితులకు ఉపయోగపడతాయా లేదా అనే కొలబద్దతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా అమలులో ఉన్నదాన్నే ఇక్కడ అమలు చేస్తున్నారు.
రహస్య ఎజెండా
కాంగ్రెస్‌, బిజెపి చేస్తున్న విష ప్రచారాన్ని ఈ నేపథ్యంలోనే చూడాలి. పాలక వర్గాల కొమ్ము కాసే మీడియా సంస్థలు ఎల్‌డిఎఫ్‌ నాయకులను బదనాం చేయడానికి నిరూపణ కాని అవినీతి ఆరోపణలను మళ్ళీ మళ్ళీ చేస్తున్నాయి. కట్టుకథలు అల్లి మీడియాలో ప్రసారం చేస్తూ ఏదన్నా పేలకపోతుందా అని ఆశపడుతున్నారు. తిరువనంతపురం లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ మధ్య వెలుగు చూసిన బంగారం స్మగ్లింగ్‌ కేసులో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ ప్రమేయం ఉన్నదని దుష్ప్రచారం చేస్తున్నారు. అంతర్జాతీయ స్మగ్లింగ్‌, కస్టమ్స్‌ నేరాలు రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వ పరిధి లోకి వస్తాయనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వారికి కావాల్సిన పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని కూడా తెలియజేశారు. ఇప్పటి వరకూ జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వానికి, నేరస్తులకు ఏ సంబంధం ఉన్నట్టు బయటపడలేదు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్న ఒక మహిళా కాంట్రాక్టు ఉద్యోగికి ఈ స్మగ్లింగ్‌ ముఠాతో గల సంబంధాలపై విచారణ జరుగుతున్నది. ఆమె తన చదువుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినట్టు అనుమానాలు రావడంతో ఆమెను సస్పెండ్‌ చేశారు. మహిళా ఉద్యోగిని పనిలో పెట్టుకోవడంలో ఆ శాఖకు సంబంధించిన పై అధికారి నిర్లక్ష్యం వహించినందుకు ఆయనను సస్పెండ్‌ చేశారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని, ఎవ్వరినీ కాపాడబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలియచేశారు.
ప్రతిపక్షం రహస్య ఎజెండాను కేరళ ప్రజలు అర్థం చేసుకుంటారని, నయా ఉదారవాదానికి భిన్నంగా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, సామాజిక అభివృద్ధి నమూనాను బలపరుస్తారని ఆశిస్తున్నాం. పారదర్శకత అనేది పరిపాలనా విలువలలో ముఖ్యమైనది. దానిని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం నిష్టగా అమలు జరుపుతున్నది. దానికి ఉదాహరణ ప్రతిరోజు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్వయంగా నిర్వహించే ప్రెస్‌మీట్‌కి లభిస్తున్న ప్రజాదరణే.
- ఎస్‌. రామచంద్రన్‌ పిళ్లై
(వ్యాసకర్త సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు)