Oct 22,2023 22:13

కబ్జా కోరల్లో వాగు స్థలం

కబ్జా కోరల్లో




వాగు స్థలం

నెత్తకుప్పంలో అధికారపార్టీ నేతల దందా
స్పందించని రెవెన్యూ అధికారులు
చురుకుగా సాగుతున్న భవన నిర్మాణాలు
తప్పుడు నివేదికలతో స్పందన ఫిర్యాదు క్లోజ్‌
ప్రజాశక్తి- రామచంద్రపురం
ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాల్సిన రెవెన్యూ అధికారులు కళ్లముందే లక్షలు విలువ చేసే వాగు పొరంబోకు స్థలాలు (ప్రభుత్వ భూములు) కబ్జా అవుతున్నాయి. గ్రామస్తులు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు స్పందన కార్యక్రమంలో జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసినా మండల రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం వల్ల కబ్జాదారులైన వైసీపీ నేతలు ప్రభుత్వ స్థలంలో చురుకుగా భవన నిర్మాణాలు సాగిస్తున్నారు. మా కబ్జాలను అడ్డుకుంటే.. మీ అంతుచూస్తాం, ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామంటూ కబ్జాదారులు పలువురిని బెదిరిస్తున్నారు. స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలు చూసుకొని అటు అధికారులు, ఇటు ఫిర్యాదుదారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. విలువైన ప్రభుత్వ భూమి కావడంతో భారీస్థాయిలో ముడుపులు చేతులు మారాయని ప్రజలు బహిరంగంగా విమర్శించుకుంటున్నారు. జగనన్నకు చెబుదాం (టోల్‌ ఫ్రీ నెంబర్‌1902) ఫిర్యాదు పై జిల్లా ఉన్నతాధికారులకు స్థానిక తహసిల్దార్‌ తప్పుడు నివేదికలతో ఫిర్యాదును ఆన్‌లైన్‌లో మూసి వేశారని, ఫిర్యాదుదారులు 16వ తేదీన కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఆర్‌సి పురం రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేశామని స్థానికులు తెలిపారు.
రామచంద్రపురం మండలం నెత్తకుప్పం గ్రామంలో తిమ్మరాజుపల్లి, అనుపల్లి ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న వాగు పరంబోకు స్థలం కబ్జాకోరల్లో చిక్కుంది. నెత్తకుప్పం రెవెన్యూ గ్రామంలో సర్వేనెంబర్‌ 188 వాగు పొరంబోకు స్థలాన్ని స్థానిక అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి, చోటా నాయకులు కలసి కబ్జా చేసి చురుకుగా భవన నిర్మాణాలను సాగిస్తున్నారు. కానీ రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను కబ్జా నుండి రక్షించాల్సింది పోయి రాజకీయ ఒత్తులకు తల్లోగ్గి, కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కబ్జాకు గురైన వాగు పొరంబోకు స్థలంకు ఎలాంటి ఇంటి పట్టాలు కూడా మంజూరు చేయలేదు. కానీ బోగస్‌ ఇంటి పట్టాలను తయారుచేసి వాటిని అడ్డం పెట్టుకొని రూ.20లక్షల విలువైన ప్రభుత్వభూమి కబ్జా చేసేసారు. వాగు స్థలం కబ్జాపై స్పందన కార్యక్రమంలో జూలై 31, సెప్టెంబర్‌ 11వ తేదీలలో జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేశామని గ్రామస్తులు తెలిపారు. స్పందన ఫిర్యాదులను కూడా లెక్కచేయకుండా ఆక్రమణదారులకు అధికారులు అండదండలు అందజేస్తున్నారని స్థానికప్రజలు బహిరంగ చర్చించుకుంటున్నారు. వాగు కబ్జాకు కావడంతో భారీ వర్షాలు వస్తే వర్షపు నీరు మొత్తం రోడ్లు భవనాల శాఖ రోడ్డుపై నిలిచిపోతాయి. రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలుగుతుంది. కబ్జాకు గురైన వాగు పొరంబోకు స్థలంలో ఆరోగ్య ఉపకేంద్రం భవనం నిర్మించాలని గతంలో నిర్ణయించారు. కానీ రెవెన్యూ అధికారులు విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడ లేకపోతున్నారు. దీనికి కారణం రాజకీయ ఒత్తిల్లె ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని.. 16వ తేదీ జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు, ఆర్‌సిపురం రెవెన్యూ అధికారులపై స్థానికులు ఫిర్యాదు చేసామని తెలిపారు. జిల్లా అధికారులైన స్పందించి వాగు పొరంబోకు స్థలంలో నిర్మిస్తున్న అక్రమ భవనాలను అడ్డుకొని కబ్జాదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించాలని స్థానికుల కోరుతున్నారు.
అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం : తహశీల్దార్‌
నెతకుప్పం రెవెన్యూలోని సర్వేనెంబర్‌ 188 వాగు పొరంబోకు స్థలం కబ్జాకు గురైన విషయం నాదష్టికి వచ్చింది. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని అక్రమణదారులను హెచ్చరించాను. ఆక్రమణదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని, నిర్మించిన భవనాలను కూడా ఎక్స్క్యూలేటర్‌ (జెసిబి) సహాయంతో కూల్చివేసి ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షిస్తాం
- జి.చిన్న వెంకటేశ్వర్లు, తహశీల్దార్‌