Sep 08,2023 22:48

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపి బాలశౌరి, చిత్రంలో కలెక్టర్‌ పి.రాజాబాబు తదితరులు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (కృష్ణా)
భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసే రైతులకు రుణాలు విరివిగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు బ్యాంకు అధికారులను కోరారు. శుక్రవారం స్పందన సమావేశపు హాలులో బ్యాంకు అధికారులతో కలెక్టర్‌ అధ్యక్షతన డిస్ట్రిక్ట్‌ కన్సల్టేటివ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బందరు పార్లమెంట్‌ సభ్యులు వల్లభనేని బాలశౌరి, కలెక్టర్‌ పి.రాజాబాబు పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 55 వేల మంది కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు మంజూరు చేయగా, వీరిలో కేవలం 7 వేల మందికి మాత్రమే రూ.30.71 కోట్ల రుణాలను మంజూరు చేశారని, మిగిలిన 48 వేల మంది కౌలు రైతులు బ్యాంకు రుణాలకు దూరమయ్యారని అన్నారు. ఈవిషయంలో బ్యాంకులు భూ యజమానికి సులువుగా రుణాలను మంజూరు చేసినట్లుగా కౌలు రైతులకు ఇవ్వకపోవడం పట్ల ఆయన అసంతప్తి వ్యక్తం చేశారు. కౌలు రైతులు ఏవిధమైన ష్యురిటీ సమర్పించనందున రుణ మంజూరుకు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని బ్యాంకర్లు తెలుపగా, అందుకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న సీసీఆర్‌సీ కార్డుల ఆధారంతోపాటు స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల పొదుపు ఖాతాల ఆధారంగా ఆయా కౌలు రైతులకు రుణాలను మంజూరు చేసే దిశగా బ్యాంకర్లు ఆలోచన చేయాలని కలెక్టర్‌ సూచించారు. స్వయం సహాయక సంఘాల గ్రూపుల నుంచి ఇన్సూరెన్సు పేరుతో అధిక ప్రీమియం, ప్రోసెసింగ్‌ ఫీజుల పేరుతో బ్యాంకులు అధికంగా నగదు వసూలు చేస్తున్నాయని డిఆర్‌డిఎ పీడీ ప్రసాద్‌ కలెక్టర్‌ దష్టికి తీసుకురాగా, స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాలపై అధిక వడ్డీలు, ఫీజులు వసూళ్లపై మాత్రమే దష్టి పెట్టకుండా మహిళల ఆర్థికాభివద్ధికి బ్యాంకులు తమ వంతుగా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. చేతివృత్తుల
కౌలు రైతులకూ రుణాలు మంజూరు
వారిని ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వడ్రంగి, స్వర్ణకారులు, కమ్మరి, పడవల తయారి, కుమ్మరి, శిల్పకారులు, చెప్పులు కుట్టేవారు, తాపీపని వంటి 18 రకాల చేతివత్తులు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు రుణం మంజూరు చేసే విధంగా విశ్వకర్మయోజన పథకానికి రూపకల్పన చేసినట్లు చెప్పారు. తమ చెంతకు వచ్చే ఆయా దరఖాస్తుదారులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ కౌలు రైతులందరికీ రుణాలను మంజూరు చేయడంలో తలెత్తే సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేందుకుగాను ఆర్‌బిఐ, నాబార్డు, వ్యవసాయం, రెవెన్యూ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. జీవనోపాధికి వ్యవసాయం ప్రాధమిక రంగమని, దేశానికి అన్నం పెట్టే కౌలు రైతుల రుణాల మంజూరుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. వీరికి విరివిగా రుణాలను మంజూరు చేసే విధంగా కేంద్ర మంత్రి, ఆర్‌బిఐ, నాబార్డులకు త్వరలో లేఖ రాయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి నిమిత్తం ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రొగ్రాం, ముద్ర రుణాలు, వీధివ్యాపారులకు సూక్ష్మ రుణాల సౌకర్యం వంటి ఎన్నో బ్యాంకు ఆధారిత పథకాలను అమలు చేస్తోందని అన్ని ప్రాంతాల వారికి సమ ప్రాధాన్యతనిస్తూ రుణాలను మంజూరు చేయలన్నారు. త్వరలో అవనిగడ్డ, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో రుణ మేళ నిర్వహించనున్నామని దీనిపై అన్ని బ్యాంకులు ప్రజల్లో అవగాహన కల్పించి మత్స్యకారులు, రైతులు, నిరుద్యోగ యువతకు ఆయా పధకాల ఆధారంగా రుణాలను అందించాలని ఎంపి కోరారు. ఈ సమావేశంలో రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏజిఎం ఆర్‌.కె. హనునుకుమారి, నాబార్డు ఏజిఎం మిలింద్‌ చౌసాల్కర్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటి రీజనల్‌ మేనేజర్‌ ఎస్‌.. సంతోష్‌, ఎల్డీఎం టి.ఎస్‌ జయవర్ధన్‌, డిఆర్‌ డిఎ పీడీ ప్రసాద్‌, జిల్లా పరిశ్రమల మేనేజర్‌ ఆర్‌. వెంకట్రావు, టిడ్కో ప్రాజెక్టు మేనేజర్‌ బి. చిన్నోడు, జిల్లా వ్యవసాయశాఖాధికారిణి ఎన్‌. పద్మావతి, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.