Jan 15,2022 04:06
  • ధాన్యం అమ్మకం సమయంలో ఆధార్‌ ఇచ్చేందుకు, వేలి ముద్ర వేసేందుకు భూ యజమానుల నిరాకరణ
  • మిల్లర్లకు, దళారులకు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి - ప్రభుత్వ నిబంధనలతో తీవ్ర ఇబ్బందులు

ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం డొంకలపర్తకు చెందిన బచ్చుల గౌరినాయుడు నాలుగు ఎకరాలు కౌలుకుతీసుకున్నాను. 88 బస్తాల ధాన్యం పండింది. సాగు ధ్రువీకరణ పత్రం కోసం ఎనిుసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆధార్‌ ఇచ్చేందుకు, వేలిముద్ర వేసేందుకు భూ యజమాని రాకపోవడంతో నేరుగా మిల్లరు దగ్గరకు వెళ్లి మాట్లాడుకున్నాడు. బస్తాకు(80 కేజీలకు) రూ.వెయ్యి ఇస్తామన్నాడు. ఎక్కడికి వెళ్లినా ఇదే ధర చెప్తుండడంతో మిల్లరుకు ఆ ధరకు ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సి వచ్చింది. తర్వాత డబ్బులు ఇస్తానని మిల్లరు చెప్పాడు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారమైతే బస్తా ఒక్కంటికీ రూ.1,552 రావాల్సి ఉంది. ఈ లెక్కన రూ.48,576 నష్టపోయాడు. ఎకరాకురూ.12 వేలు చొప్పున నాలుగు ఎకరాలకు రూ.48 వేలు కౌలు చెల్లించాలని భూ యాజమానికి, కౌలు రైతులకు ఒప్పందం ఉంది.
- ఆమదాలవలస మండలం లక్ష్ముడుపేటకు చెందిన రైతు జయరాం ఆరు ఎకరాల భూమినికౌలుకు తీసుకుని సాగు చేశాడు. పంట చేతికి వచ్చిన సమయంలో తుపాను వల్ల దెబ్బతినడంతో 140 బస్తాలు మాత్రమే చేతికి వచ్చాయి. పంట అమ్ముకునేందుకు భూ యజమాని ఆధార్‌ ఇచ్చేందుకు, వేలిముద్రలు వేసేందుకు రాకపోవడంతో కొనుగోలు కేంద్రానికి వెళ్లలేకపోయాడు. చివరకు దళారులను సంప్రదించాడు. బస్తా రూ.1,300 చొప్పున రూ.1.82 లక్షలకు అమ్ముకోవాల్సి వచ్చింది. అందులో కౌలు కింద ఎకరాకు రూ.15 వేలు చొప్పున రూ.90 వేలు భూ యజమానికి చెల్లించాడు.
ప్రభుత్వం 2021-22 ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు పంటల ఇ-క్రాపింగ్‌తో పాటు ఈ ఏడాది రైతుల ఆధార్‌, వేలిముద్రలు ఉండాలనే నిబంధన విధించింది. ఈ నిబంధనలు కౌలు రైతులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. భూ యజమానులు తమ భూములను కౌలుకు ఇచ్చినా ధాన్యం అమ్మకం సందర్భంలో ఆధార్‌ ఇచ్చేందుకు, వేలిముద్రలు వేసేందుకు ముందుకు రావడం రాలేదు. దీంతో, కౌలు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్ముకోవడం కుదరడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో 2021-22 ఖరీఫ్‌లో 2,92,943 మంది రైతులు 4,93,330 ఎకరాల్లో వరి పంట వేశారు. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఇందులో 2,31,522 మంది రైతులకు సంబంధించి మాత్రమే ఇకెవైసి పూర్తయింది. మరో 61,421 మందికి ఇకెవైసి వివరాలు నమోదు కాలేదు. దీంతో, వీరి నుంచి రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం తీసుకోవడం లేదు.
18 వేల మందికే సాగు ధ్రువీకరణ పత్రాలు
శ్రీకాకుళం జిల్లాలో సుమారు 1.50 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉన్నారు. వారిలో 18 వేల మందికి మాత్రమే ప్రభుత్వం సాగు ధ్రువీకరణ పత్రాలు అందజేసింది. వీరు రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోగలుతున్నారు. కొన్ని చోట్ల కౌలు రైతులు భూ యజమానులను ఏదో విధంగా ఒప్పించి ధాన్యం అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు తమకు తెలిసిన రైతుల సర్వే నంబర్లు, అడంగల్‌ ద్వారా వారి ధాన్యంతోపాటే అష్టకష్టాలు పడి పంపుతున్నారు. ఈ విధంగా సుమారు 71 వేల మంది రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మిగిలిన 61 వేల మంది కౌలు రైతులు ఎటువంటి సహకారమూ లేకపోవడంతో తమ ధాన్యాన్ని నేరుగా మిల్లర్లకు, దళారులకు తెగనమ్ముకోవాల్సి వస్తోంది.