Feb 23,2023 18:52

మాట్లాడుతున్న రాజశేఖర్‌

ప్రజాశక్తి -కందుకూరు  ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనార్టీ సంక్షేమ హాస్టల్స్‌, రెసిడెన్సీయల్‌ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నామమాత్రంగా నెలకు రూ. 150 నుంచి రూ. రూ. 200 పెంచడం కంటితుడుపు చర్య మాత్రమేనని, ఆ ధరలతో పౌష్టికాహారం ఎలా అందుతుందని పిడిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్‌ రాజశేఖర్‌ ఆరోపించారు. కందుకూరులోని ఎన్‌జిఒ హోమ్‌లో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో రాజశేఖర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్‌సి-1071, ఎస్‌టి-640, బిసి -1152, మైనార్టీ 118 హాస్టల్స్‌లో 5లక్షల మందికి పైగా పేద విద్యార్థులు చదువుతున్నారన్నారు. 2018-19 విద్యా సంవత్సరంలో గత ప్రభుత్వ హయాంలో హై స్కూల్‌ హాస్టల్‌ విద్యార్థులకు రూ.1250, కాలేజీ హాస్టల్‌ విద్యార్థులకు రూ. 1400 మెస్‌ చార్జీలను పెంచారన్నారు. కాస్మోటిక్‌ ఛార్జీలను బాలురకు నెలకు రూ.155లకు, బాలికలకు రూ.160లకు పెంచారన్నారు. గత 4 ఏళ్లు మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. పెరిగిన ధరలను బట్టి చూస్తే హై స్కూల్‌ హాస్టల్‌ విద్యార్థులకు నెలకు రూ.3000, కాలేజీ హాస్టల్‌ విద్యార్థులకు రూ.4000 పెంచాలన్నారు. తక్షణమే పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ కాస్మోటిక్‌ చార్జీలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పిడిఎస్‌యూ జిల్లా నాయకుడు ఎం కిషోర్‌, కందుకూరు డివిజన్‌ సెక్రెటరీ మహేష్‌, హర్ష, సుధీర్‌ తదితరులు పాల్గున్నారు