బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డికె శివకుమార్ ఓ కార్యకర్తపై చేయిచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ ఎంపిని పరామర్శించేందుకు డికె శివకుమార్ శుక్రవారం మాండ్యాలో పర్యటించారు. ఆయన అక్కడికి రాగానే పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చాయి. డికె శివకుమార్ నడుస్తుండగా ఓ కార్యకర్త ఆయనను ఆనుకుని నడుస్తూ వీపుపై చేయి వేశాడు. దీంతో శివకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కార్యకర్త చెంపఛెళ్లుమనించారు. పార్టీ అధ్యక్షుడి వైఖరితో ఆ కార్యకర్త అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయాడు. ''చనువిచ్చింది ఇలా చేయమని కాదు.. నీ ప్రవర్తనేంటి?'' అంటూ శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన వారి సెల్‌ఫోన్లను డికె విసిరేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇక, తాజా ఘటనపై కర్ణాటక బిజెపి వర్గాలు వెంటనే విమర్శల దాడి మొదలుపెట్టాయి. డికె శివకుమార్ సొంత పార్టీ కార్యకర్తపైనే జులుం ప్రదర్శించడం తీవ్ర గర్హనీయమని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.ప్రకాశ్ పేర్కొన్నారు. గతంలో సొంత క్యాడర్‌పై ఆయన ఇలాగే ప్రవర్తించారని ఆరోపించారు. జనబాహుళ్యంలో ఎలా నడుచుకోవాలో తెలియని వ్యక్తి ఇవాళ ఓ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడని విమర్శించారు.










