Apr 26,2023 21:48

ఫొటో : మాట్లాడుతున్న ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ సంఘం నాయకులు

కారుకులపై చర్యలు తీసుకోవాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : దళిత అంగన్‌వాడీ తాత్కాలిక సూపర్‌వైజర్‌ నికిత ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.సుజాత, షేక్‌ రెహనాబేగం డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న నికితను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీతారామపురం హరిజనవాడ అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్న కార్యకర్త నికిత ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తాత్కాలిక సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తూ క్రమంలో తన అంగన్వాడి కేంద్రాన్ని సజావుగా నిర్వహిస్తుండగా కొందరు కుట్రపూరితంగా కావాలని వేధింపులకు గురిచేసి ఆత్మహత్య చేసుకొనెంత వరకు తీసుకొచ్చారన్నారు. ఈ ఘటనను అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌గా తాము ఖండిస్తున్నామన్నారు.
కొన్ని పత్రికల విలేకరులు వారి స్వార్థ స్వప్రయోజనాల కోసం పదేపదే నికితను బెదిరిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేసి ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకొచ్చిన వారిపై వెంటనే చర్యలు సుకోవాలన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలు ఆధారాలతో విచారణ జరిపిన సూపర్‌వైజర్లు సంతృప్తి వ్యక్తపరిచి పోయారని తెలిపారు. తూ.తూ. మంత్రంగా విచారణ ఎలా జరుపుతారని సూపర్‌వైజర్లను ప్రశ్నించిన ఆ విలేకరులు మళ్లీ తమ సమక్షంలో విచారణ జరపాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వారికి సంబంధించిన ఆరుగురు అంగన్‌వాడీ లబ్ధిదారులతో కేంద్రానికి రప్పించి కేంద్రంలో అవినీతి జరుగుతుందని చెప్పించడం ఏమిటని ప్రశ్నించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు ఒంటరిగా మహిళలు ఉన్నప్పుడు వీడియోలు తీయడం బెదిరించడం బాధాకరమన్నారు. గ్రామాల్లో పనిచేసే క్రమంలో టార్గెట్‌ చేసి ఇలా వార్తా పత్రికల్లో వార్తలు రావడం అవమానకరంగా భావించి ఆ కార్యకర్త సూసైడ్‌కు పాల్పడినట్లు తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని వారు ఈ సందర్భంగా వివరించారు. నికితపై భారీగా కుట్ర చేసి రాజకీయ నాయకుల అండతో కుట్రలు చేసిన విలేకరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎపి అంగన్‌వాడీ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఆమె సూసైడ్‌ నోట్లో రాసిన వారిపై తప్పనిసరిగా చర్యలు చేపట్టాలని ఎస్‌ఐ, సిడిపిఒ ఫోన్‌ ద్వారా అర్జీ రూపంలో వారు కోరారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే మరల అంగన్‌వాడీ కార్యకర్తలు వెల్ఫేర్లు ఇలాంటి సంఘటనలకు గురికాకుండా వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌, జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌, పిడిను కలుస్తామన్నారు. మొదటిగా యూనియన్‌ నాయకులతో నికిత వారి కుటుంబం సభ్యులను పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకుని న్యాయం జరిగేంత వరకు తోడుగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఆఫీస్‌ బేరర్‌ ప్రాజెక్ట్‌ కార్యదర్శి లక్ష్మి, సిఐటియు జిల్లా సభ్యులు గడ్డం నాగేశ్వరావు, రైతు సంఘం నాయకులు, కాకు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.