Nov 12,2021 06:54

ఆదర్శ యజమానిగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలో చట్టాలను అమలు చెయ్యకుండా దోషిలా నిలబడుతున్నది. కాంట్రాక్టు లేబర్‌ (అబాలిషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌) చట్టం-1970 ప్రకారం రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు అమలు చెయ్యాలి. అంటే రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా బేసిక్‌, డి.ఎ, హెచ్‌.ఆర్‌.ఏ, సి.సి.ఎ మరియు లీవులు, జి.పి.ఎఫ్‌, హెల్త్‌ కార్డులు తదితర అన్ని సౌకర్యాలు వర్తింపచెయ్యాలి.

   'ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు పెంచుతాం. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తాం...' ఇవీ వై.ఎస్‌.ఆర్‌.సి.పి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు. రెండున్నర సంవత్సరాల క్రితం జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకిచ్చిన హామీలను నెరవేరుస్తామని పత్రికాముఖంగా మరోసారి పేర్కొన్నారు. ఈ రోజు వరకు వాటిని అమలు చెయ్యనేలేదు. గత మూడు పి.ఆర్‌.సి ల కాలంలో రెగ్యులర్‌ ఉద్యోగులకు పి.ఆర్‌.సి అమలు చేశాక, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ జీవో లను జారీ చేశారు. 8, 9 పి.ఆర్‌.సి ల కాలంలో నాటి రెగ్యులర్‌ ఉద్యోగుల మినిమం బేసిక్‌ను (మినిమమ్‌ ట్కెమ్‌ స్కేల్‌ను) కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వర్తింపచేస్తూ నాటి ప్రభుత్వాలు జీవో లు జారీ చేశాయి. కాని దానికి భిన్నంగా పదవ పి.ఆర్‌.సి కాలంలో గత తెలుగుదేశం ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను బేసిక్‌ను బట్టి 3 స్లాబులుగా విభజించి మినిమమ్‌ ట్కెమ్‌ స్కేల్‌ (కనీస బేసిక్‌) కన్నా తక్కువగా వేతనాలను పెంచుతూ జీవో-151 జారీ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగులకు విడిగా పర్సంటేజిగా వేతనాలు పెంచుతూ జీవో లు జారీ చేసింది. తద్వారా ఈ ఉద్యోగులకు అన్యాయం చేసింది. జరిగిన అన్యాయాన్ని వై.సి.పి ప్రభుత్వం సరి చేస్తుందని ఎదురు చూస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నిరాశే మిగిల్చింది.
    కాంట్రాక్టు ఉద్యోగులకు, మినిమమ్‌ ట్కెమ్‌ స్కేల్‌ను కొన్ని విభాగాలకే వర్తింపచేస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వం జీవో జారీ చేసినా అది అమలుకు నోచుకోలేదు. దానినే ప్రస్తుత ప్రభుత్వం మరలా జీవో గా ఇటీవలే జారీ చేసింది. అయితే సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌.ఎస్‌.ఏ), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌.హెచ్‌.ఎమ్‌) లోని స్టాఫ్‌ నర్సు తదితర కేడర్లకు, అనేక శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు నేటికీ మినిమం టైమ్‌ స్కేల్‌ అమలు కావడం లేదు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, పార్ట్‌ టైమ్‌ కాంట్రాక్టు తదితర ఉద్యోగులందరికీ మినిమమ్‌ ట్కెమ్‌ స్కేల్‌ వర్తింపచేయాల్సిన బాధ్యత, రెగ్యులర్‌ ఉద్యోగులతోపాటు పి.ఆర్‌.సి అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉన్నది. దీని అమలు కోసం ఉద్యోగులందరూ ఐక్యంగా ముందుకు సాగాలి.
    ఆదర్శ యజమానిగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలో చట్టాలను అమలు చెయ్యకుండా దోషిలా నిలబడుతున్నది. కాంట్రాక్టు లేబర్‌ (అబాలిషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌) చట్టం-1970 ప్రకారం రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు అమలు చెయ్యాలి. అంటే రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా బేసిక్‌, డి.ఎ, హెచ్‌.ఆర్‌.ఏ, సి.సి.ఎ మరియు లీవులు, జి.పి.ఎఫ్‌, హెల్త్‌ కార్డులు తదితర అన్ని సౌకర్యాలు వర్తింపచెయ్యాలి. సుప్రీంకోర్టు 'సివిల్‌ అప్పీల్‌ 213 ఆఫ్‌ 2013'లో ఇచ్చిన తీర్పు ప్రకారం రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వారికి రెగ్యులర్‌ ఉద్యోగుల బేసిక్‌ను వేతనంగా చెల్లించాలి. కాంట్రాక్టు ఉద్యోగులకూ పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ లను వర్తింపచేయాలి. ఇటీవలె ఇద్దరు కాంట్రాక్టు హెల్త్‌ అసిస్టెంట్లు ఎటువంటి రిటైర్మెంట్‌ బెనిఫిట్లు లేకుండానే రిటైర్‌ అయిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు, ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా అన్యాయంగా వ్యవహరిస్తోంది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వివరాలు సేకరిస్తామని పి.ఆర్‌.సి మీద ఇటీవల జరిగిన చర్చల్లో ఆర్థికశాఖ కార్యదర్శి ప్రకటించారు. అంటే గత 20 సంవత్సరాలుగా పని చేయించుకోవడమే కాని, కనీసం వారి వివరాలు కూడా లేని స్థితిలో ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. నేడు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సేవలందించని ప్రభుత్వ కార్యాలయం / ఆఫీసు / ఆసుపత్రి / స్కూళ్ళు లేవు. కాని పాలకులు చట్ట ప్రకారం వారికి రావాల్సిన వేతనాలు, సౌకర్యాలు అమలు చేయడం లేదు. ఉద్యో గులందరూ ఒక తాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టక పోవడమే నేటి పరిస్థితికి కారణం.
   కరోనా కాలంలోనూ వైద్య, ఆరోగ్యశాఖ మరియు ఇతర శాఖల్లో సేవలందించిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కరోనా సోకి దాదాపు 200 మంది 2021 ఏప్రిల్‌, మే నెలల్లో మరణించారు. వారి కుటుంబాలకు నేటికీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించలేదు. కరోనా సోకిన వందలాది మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల 14 రోజుల వేతనాలను కత్తిరించి రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించింది. వైద్య, ఆరోగ్య శాఖలో రెగ్యులర్‌ ఉద్యోగులకు మాత్రమే ఎక్స్‌గ్రేషి యా నిర్ణయిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం...ఆ శాఖలో కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, హెల్త్‌ సెక్రటరీలు, ఆశాలకు ఎక్స్‌గ్రేషియా వర్తింపచేస్తూ జీవో ఇవ్వకుండా దుర్మార్గపు యజమానిగా నిలబడిరది.
      వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఐక్యంగా నిలబడాలి. సమాన పనికి సమాన వేతనం, రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు పి.ఆర్‌.సి, రెగ్యులరైజేషన్‌, ఎక్స్‌గ్రేషియా, రిటైర్మెంట్‌ బెనిఫిట్లు, తదితర సమస్యల పరిష్కారానికై ఐక్య ఆందోళనలు చేపట్టాలి. కాంట్రాక్టు పేరిట, ఔట్‌సోర్సింగ్‌ పేరిట, వివిధ పథకాల పేరిట, నియమించిన విధానం పేరిట అనైక్యంగా ఉండటం 3 లక్షల మంది ఉద్యోగులకూ నష్టమని గ్రహించాలి. వారంతా కలిసి ఐక్య ఆందోళనలు చేపట్టాలి. పాలకులపై ఒత్తిడి తేవాలి. అప్పుడే పూర్తి స్థాయి విజయాలు సాధించగలరు.
 

/వ్యాసకర్త : రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జెఎసి చైర్మన్‌/

ఏ.వి.నాగేశ్వరరావు

ఏ.వి.నాగేశ్వరరావు