Apr 07,2023 21:41

కడప విద్యుత్‌ భవన్‌ ఎదుట ఫ్లకార్డులతో నిరసన తెలియజేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు, ఉద్యోగులు (ఫైల్‌ఫొటో)

 కడప ఎపిలో విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు కనుమరుగయ్యాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, వారిని శ్రమదోపిడీకి గురిచేస్తున్నా ఉన్నాయి. చాలీచాలని వేతనాలతో వారి జీవితాలు కొట్టుమిట్టాడుతున్నాయి. 25 ఏళ్లుగా పనిచేస్తున్నా వారి జీవితాలు ఎక్కడ వేసిని అక్కడే అన్నచందంగా మారింది. విద్యుత్‌ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23,548 మంది కార్మికులు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో ఎపి ట్రాన్స్‌కోలో 4107 మంది, ఎపిజెన్‌కో 3383 మంది, ఎపిఇపిడిసిఎల్‌లో 5047 మంది, ఎపిఎస్‌పి డిసిఎల్‌లో 7708 మంది, ఎపిసిపిడిఎల్‌లో 3303 మంది కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. కడప జిల్లాలో దాదాపుగా 2000 మంది పైచిలుకు విద్యుత్‌ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో డిప్లమో, డిగ్రీ, బీ.టెక్‌, పీజీ విద్య అర్హతలతో 25 ఏళ్లుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. వీరికి నెలకు కనీస వేతనం రూ. 20 వేలు కూడా రావడం లేదు. ఇదే విద్య అర్హతలతో రెగ్యులర్‌గా పనిచేసే ఉద్యోగులకు రూ. 60 వేల నుంచి 80 వేల వరకు వస్తుంది. వీరితోపాటు సమానంగా పనిచేసే తమకు ఎందుకు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టు కార్మికులను, ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని హామీలు ఇస్తున్నాయే తప్ప వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టిన సమయంలో మన ప్రభుత్వం రాగానే విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను ఉద్యోగులను రెగ్యులర్‌ రైస్‌ చేస్తామని హామీ ఇచ్చారు. వారి వారి విద్య అర్హతలను బట్టి, అనుభవాన్ని బట్టి రెగ్యులరైజ్‌ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కూడా హామీ ఇచ్చారు. కానీ మరిచారని కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో ఎన్నాళ్ళు ఈ ఎట్టి చాకిరి అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులను తెలంగాణ హైకోర్టు ఎదుగు బదుకు లేదని గమనించి వారిని ఇండిస్టియల్‌ యాక్ట్‌ కింద రెగ్యులరైజ్‌ చేయవచ్చునని తీర్పునిచ్చింది. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులను 2017లో విద్యుత్‌ సంస్థలో విలీనం చేసుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వచ్చేసరికి రైగ్యులరైజ్‌ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా చేసేందుకు ఇటు విద్యుత్‌ యాజమాన్యం కానీ, ప్రభుత్వాలు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. ఇది ఎంతవరకు సమంజసమని కాంట్రాక్ట్‌ కార్మికులు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఎటువంటి అలవెన్సు , ఉద్యోగ భద్రత లేకుండా, విద్యుత్‌ సంస్థనే నమ్ముకొని కొన్నేళ్లుగా పనిచేస్తున్నా నెలకు రూ. 20 వేలు కూడా రాకపోతే జీవనం జీవనం ఎలా సాగించాలో అర్థం కావడం లేదని వాపోయారు. పెరిగిన ధరలతో కుటుంబాలు అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ శ్రమను, విద్య అర్హతలను బట్టి, అనుభవాన్ని బట్టి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రెగ్యులరైజ్‌ చేస్తారన్న ఆశతో విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
తక్షణం రెగ్యులర్‌ చేయాలి..
ఇప్పటికైనా యాజమాన్యం, ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చి విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులను తక్షణం రెగ్యులరైజ్‌ చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. థర్డ్‌ పార్టీ విధానం తీసివేయాలి అని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి, విద్యుత్‌ సంస్థ యాజమాన్యానికి ఇప్పటికే చాలా మార్లు వినతి పత్రాలు అందజేశాం. కానీ స్పందన లేదు. విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీని వాసుల రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వినతి పత్రాలు సమర్పించాం. వారు స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇచ్చిన హామీని, మాటను నిలబెట్టుకోవడం మరిచారు. నిత్యావసర సరుకుల ధరలు మూడు రేట్లు పెరిగాయి. అందుకు తగ్గట్టుగా కాంట్రాక్టు కార్మికులకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకపోవడం చాలా దారుణం. ఇప్పటికైనా యాజమాన్యం ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చి కాంట్రాక్టు కార్మికులను ఉద్యోగులను రెగ్యులరైస్‌ చేసి వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాం.
- ఎన్‌. శివ శంకర్‌, డిస్కం అధ్యక్షులు, యుఈఈయు, కడప.