Nov 07,2020 07:14

         పార్టీ శ్రేణులు ఆత్మీయంగా బాబాయ్ అని పిలుచుకునే కామ్రేడ్‌ తంబాబత్తుల బసవ పూర్ణచంద్రరావు 80 సంవత్సరాల వయసులో కోవిడ్‌ కారణంగా, అక్టోబర్‌ 26వ తేదీన ఆఖరి శ్వాస విడిచారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి విజయవాడ నగర పార్టీ బాధ్యుడిగా, కృష్ణా జిల్లా పార్టీ నాయకుడిగా, రాష్ట్ర కార్మిక సంఘంలో సీనియర్‌ నాయకుడిగా దీర్ఘకాలం పని చేశారు. పూర్ణ బాబాయ్ కంకిపాడులో కమ్యూనిస్టు కుటుంబంలో కోటయ్య- కనకమ్మలకు జన్మించారు. 1945-52 కాలంలో కమ్యూనిస్టు పార్టీపై తీవ్ర నిర్బంధం కొనసాగుతున్న కాలంలో కాంగ్రెస్‌ వాళ్ళు పార్టీ వారి ఇళ్లపై ఎర్ర జెండాలను పీకేస్తే... చిన్న వయసులోనే తమ ఇంటిపై ఎర్ర జండా తిరిగి ఎగరవేశాడు. తల్లి, తండ్రి చనిపోయిన తర్వాత విజయవాడ వన్‌టౌన్‌లో ఉంటున్న అక్క కుటుంబానికి తోడుగా విజయవాడ రావడంతో...15 సంవత్సరాల వయసులో పూర్ణ బాబాయ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1964లో మేనమామ కూతురు అరుణను తిరుపతిలో పెళ్లి చేసుకుని విజయవాడకు చేరిన వెంటనే...పసుపు బట్టలతోనే భాస్కర్‌ రావుపేటలో సిరీస్‌ రాజు ముఠా పేదల ఇల్లు తగలబెట్టిన ఘటనలో యువతతో కలిసి ఎదుర్కొన్నాడు. యుసిసిఆర్‌ఐ ఎంఎల్‌ పార్టీగా ఉన్న కాలంలో విజయవాడ నగర టౌన్‌ కమిటీ సభ్యుడిగా ఉంటూ పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. విజయవాడ నగరంలో మేడే కార్యక్రమాలు వన్‌ టౌన్‌ మొదలుకొని నిడమానూరు వరకు ప్రతి సంవత్సరం జరుపుతూ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపేవారు. పొట్ట కోస్తే అక్షరం ముక్క రాకపోయినా....పార్టీ పంథాను అవగాహన చేసుకోవటమేకాక దాన్ని అమలు పరచడంలో ఎదురయ్యే అడ్డంకులను, శత్రువుల దాడులను, పోలీసు నిర్బంధాలను ఎదుర్కొని నిలబడ్డ కామ్రేడ్‌ పూర్ణ బాబాయికి విప్లవ జోహార్లు !

ముప్పాళ్ళ భార్గవ శ్రీ,
సిపిఐ (ఎంఎల్‌) రాష్ట్ర నాయకులు, సెల్‌: 9848120105.