పేదల భూములను ప్రభుత్వాలు బలవంతంగా లాక్కుని బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌శక్తులకు కట్టబెడు తున్నాయి. దీంతో పేదలు భూములు కోల్పోయి వ్యవసాయేతర కార్మికులుగా మారుతున్నారు. చట్టబద్దంగా భూస్వామ్య విధానం రద్దయినా 40 శాతం దాకా భూములు భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి. ఈ విధంగా పెట్టుబడి దారులకు, భూస్వాములకు మధ్య లంకె బలపడింది. ఈ పరిస్థితుల్లో పేదలను సమీకరించడంలో ఉన్న ఆటంకాలను అధిగమించి, వారిని చైతన్యవంతులను చేసి భూపోరాటాలు కొనసాగించాలి.
జమీందారీ విధానం రద్దు కోసం, దున్నే వానికే భూమి కోసం సాగిన పోరాటమే చల్లపల్లి భూపోరాటం. ఇలాంటి పోరాటాల ఫలితంగా 1948లో జమీందారీ విధానం రద్దు చట్టం వచ్చింది. ఈ పోరాటంలో ప్రజలను ముందుండి నడిపించిన అగ్ర నాయకుల్లో గుంటూరు బాపనయ్య ఒకరు.
కామ్రేడ్ బాపనయ్య నిరుపేద, దళిత వ్యవసాయ కార్మిక కుటుంబంలో పుట్టి పేదరికాన్ని, కుల వివక్షతను ఎదుర్కొంటూనే నాగాయతిప్ప నుండి అవనిగడ్డ వెళ్ళి హైస్కూల్ విద్య పూర్తి చేశారు. అనంతరం కాకినాడ పిఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి స్వగ్రామం వచ్చి వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేస్తూ కమ్యూనిస్ట్‌గా మారాడు. చల్లపల్లి జమీందారు ఆక్రమించుకున్న 17వేల ఎకరాల భూమి పేదలకు పంచాలనే పోరాటానికి నాయకత్వం వహించారు. లంక భూములు పేదలకు చెందాలని పోరాడి దాదాపు 6వేల ఎకరాలు స్వాధీనపరుచుకున్నారు. జమీందారీ విధానం రద్దు చట్టం వచ్చినప్పటికి అనేక కుట్రలతో, మోసాలతో చల్లపల్లి జమీందారు తన చేతి నుండి భూమి జారిపోకుండా పడరాని పాట్లు పడ్డాడు. తెలంగాణాలో జరిగిన వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం, చల్లపల్లి జమీందారీ వ్యతిరేక పోరాటం, మునగాల, పిఠాపురం, కపిలేశ్వరపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో జమీందారీ వ్యతిరేక పోరాటాల్లో ప్రజలు ఎర్రజెండా చేతపట్టి ఉవ్వెత్తున కదిలారు.
ఈ పోరాటాల ఫలితంగా 1955లో నెహ్రూ ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల చట్టం తెచ్చింది. ''మాహలనోబిస్'' కమిటీ లెక్కల ప్రకారం దేశంలో 6.30 లక్షల ఎకరాల మిగులు భూమిని పేదలకు పంచుతానని పార్లమెంటులో ప్రకటించింది. నెహ్రూ అనంతరం ఇందీరాగాంధీ భూ సంస్కరణల చట్టం తెచ్చి పేదలకు భూమిని పంచుతానని చెప్పింది. చట్టంలో లొసుగులు పెట్టి భూస్వాముల ప్రయోజనాలు కాపాడింది. భూ పంపిణీ పేరుతో సాగుకు పనికి రాని కొండ, మెట్ట, బంజరు భూమిని కొంత పంపిణీ చేసింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పేదలకు భూములు పంచుతామని భ్రమలు కల్పించాయి.
సరళీకరణ విధానాల్లో భాగంగా తీసుకొచ్చిన సెజ్‌లు(ప్రత్యేక ఆర్థికమండళ్లు) నయా జమిందారీ విధానాన్ని తిరిగి రుద్దాయి. భూసంస్కరణల చట్టానికి తూట్లు పొడిచి కార్పొరేట్లకు 5వేలు నుంచి 10వేల ఎకరాల వరకు సెజ్‌ల పేరుతో భూమిని ప్రభుత్వమే కట్టబెడుతున్నది. పేదలు సాగు చేసుకుంటున్న జిరాయితీ భూములు, పేదలకు, దళితులకు పంచిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కొని వీరికి అప్పగించింది. ఆ విధంగా భూసంస్కరణల చట్టానికి ఎసరు పెట్టారు. రైతులు, దళితుల నుండి భూమిని కారుచౌకగా తీసుకుని పరిశ్రమల పేరుతో పెట్టుబడిదార్లకు అప్పగిస్తున్నది. సెజ్‌లతో భూములు పొందినవారు పరిశ్రమల కోసం కాకుండా వాటిని ఇతర ప్రయోజనాల కోసం వాడుకుంటున్న ఉదాహరణలు కోకొల్లలు. భూములు కోల్పోయిన వారి ఉద్యోగాల ఊసే లేదు. భూములు కోల్పోయిన పేదలు చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక వలస బాట పడుతున్నారు. రాయలసీమ జిల్లాల్లోను, కాకినాడ వద్ద వేలాది ఎకరాలు సేకరించిన భూములను నేడు పరిశ్రమల యజమానులు ఆ భూములను బ్యాంకుల్లో తాకట్టుబెట్టి వందల కోట్ల రూపాయలు అప్పనంగా తీసుకొని ఆ డబ్బుతో రియల్‌ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నారు. '' మా భూముల్లో పరిశ్రమలు స్థాపించి ఉపాధి అయినా చూపండి, లేకుంటే మా భూములు మాకివ్వండి'' అని పోరాడుతున్నారు. పేదలు చేస్తున్న పోరాటానికి రెవిన్యూ యంత్రాంగం, పోలీసులు సానుకూలంగా వ్యవహరించకుండా భూస్వాములకు వత్తాసు పలులకుతున్నారు. పేదలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు.
ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో రైతాంగం నుండి వేల ఎకరాల భూములు సేకరిస్తున్నారు, ప్రాజెక్టులు నిర్మించిన తరువాత మిగిలిన వందలాది ఎకరాలు భూయజమానులేే తిరిగి ఆక్రమించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేటలో ప్రాజెక్టు కట్టగా మిగిలి ఉన్న భూములను భూస్వాములు ఆక్రమించి సాగు చేస్తుండగా, ఆ భూములు మాకే దక్కాలని పోరాడిన దళితులపై భూస్వాములు అగ్రకుల దుహంకారంతో దాడులకు దిగారు. కత్తులు, బరిసెలతో జరిపిన దాడిలో ముగ్గురు దళితులు చనిపోయారు. అయినా దళితులకు ఇప్పటికీ ఆ భూమి దక్కలేదు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం దగ్గరలో ఎర్రకాలువలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత మిగిలి ఉన్న 2వేల ఎకరాలు భూస్వాములు సాగుచేస్తున్నారు. నేడు దళితులు, గిరిజనులు ఆ భూములను సాగు చేస్తుంటే పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారు. వంశధార ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో దాదాపు 4 వేల ఎకరాలు మిగిలాయి. ఈ భూములను పేదలు సాగుచేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించడంలేదు. మిగతా జిల్లాల్లోనూ వివిధ రూపాల్లో భూస్వాములు వేల ఎకరాల భూములను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు.
ఒకనాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన పేరుతో బంజరు భూములు, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అసైన్డ్ భూములు పేదలకు పంచేవారు. నేడు సరళీకరణ విధానం అమలుతో సంక్షేమం గాలికి ఎగిరిపోయి పేదల భూములను ప్రభుత్వాలు బలవంతంగా లాక్కుని బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌శక్తులకు కట్టబెడుతున్నాయి. దీంతో పేదలు భూములు కోల్పోయి వ్యవసాయేతర కార్మికులుగా మారుతున్నారు. చట్టబద్దంగా భూస్వామ్య విధానం రద్దయినా 40 శాతం దాకా భూములు భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి. ఈ విధంగా పెట్టుబడిదారులకు, భూస్వాములకు మధ్య లంకె బలపడింది. ఈ పరిస్థితుల్లో పేదలను సమీకరించడంలో ఉన్న ఆటంకాలను అధిగమించి, వారిని చైతన్యవంతులను చేసి భూపోరాటాలు కొనసాగించాలి. ఇదే కామ్రేడ్ బాపనయ్యకు మనం అర్పించే నిజమైన నివాళి.
(రచయిత ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు)
దడాల సుబ్బారావు










