Jul 20,2021 11:46

వాషింగ్టన్‌ : అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సంపన్నుడు అయిన జెఫ్‌ బెజోస్‌ నేడు అంతరిక్ష యాత్ర చేపట్టనున్నారు. న్యూ షెవర్డ్‌ వ్యోమనౌకలో ఆయన అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. బెజోస్‌తో పాటు మహిళా వ్యోమగామి వాలీఫంక్‌ (82), ఒలివర్‌ డెమెన్‌ (18)లు ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కానున్నారు. వాలీ ఫంక్‌ వృద్ధురాలు కాగా, ఒలివర్‌ అత్యంత పిన్నవయస్కుడు, బెజోస్‌ అత్యంత సంపన్నుడు ..ముగ్గరు   కలిసి ఈ అంతరిక్ష యాత్ర చేయనున్నారు. బ్లూ ఆరిజన్‌ తన మొట్టమొదటి మిషన్‌లో భాగంగా.. కారమాన్‌ రేఖకు చేరుకుని, తిరిగి పశ్చిమ టెక్సాస్‌కు చేరుకుంటుంది. 11 నిమిషాల పాటు ఈ అంతరిక్ష యాత్ర కొనసాగుతుంది. పశ్చిమ టెక్సాస్‌ ఎడారి నుండి ఉదయం ఎనిమిది గంటలకు (భారత కాలమానం ప్రకారం.. ఒంటి గంటకు) రాకెట్‌ లాంచ్‌ అవుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని, ఈ ప్రయాణమంతా బ్లూ ఆరిజిన్‌. కామ్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుందని బ్లూ ఆరిజన్‌ సిఇఒ బాబ్‌ స్మిత్‌ తెలిపారు. గంటకు 3700 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది.

రోదసీలో తేలియాడే అంతరిక్ష కాలనీలను నిర్మించే లక్ష్యంతో 2000లో బ్లూ ఆరిజన్‌ను బెజోస్‌ స్థాపించారు. అక్కడ కృత్రిమ గురుత్వాకర్షణ స్థితిని కల్పించి, లక్షల మంది పనిచేసుకుంటూ, జీవించగలిగేందుకు అనువైన పరిస్థితులను సృష్టించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్లూ ఆరిజన్‌ ప్రస్తుతం న్యూ గ్లెన్‌ అనే భారీ రాకెట్‌ ను అభివృద్ధి చేసే పనిలో ఉంది. చంద్రుడిపై దిగే ల్యాండర్‌ను రూపొందించి, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టే ఆర్టెమిస్‌ కార్యక్రమంలో భాగస్వామి కావాలని భావిస్తోంది. జులై 20న ఇదే రోజు యూరి గగారిన్‌ చంద్రునిపై కాలు పెట్టాడు. 1961లో చేపట్టిన ఆ యాత్ర 52వ వార్షికోత్సవం జరుపుకుంటున్న రోజునే బెజోస్‌ అంతరిక్షంలోకి వెళ్లడం గమనార్హం.