Apr 28,2023 14:54

ప్రజాశక్తి-కాకినాడ : సముద్రంలో వేటకు వెళ్లిన ప్రతి మత్స్యకారునికి జనసేన బాసటగా నిలుస్తుందని ఈ వేట విరామ సమయంలో వారికి ప్రభుత్వ పరిహారాన్ని సకాలంలో అందించాలని జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. మత్స్యకారుల పొట్ట కొట్టే జీవో నెంబర్ 2170 ని వెంటనే రద్దు చేయాలన్నారు. శుక్రవారం కాకినాడ ఏటిమొగ ప్రాంతంలో ఉన్న మత్స్యశాఖ కార్యాలయం ఎదుట జనసేన పార్టీ ఆధ్వర్యంలో మత్స్యకారుల బాసటగా జనసేన భారీ సభను నిర్వహించింది. ఈ సభకు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ వేట విరామ సమయంలో ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి పదివేల రూపాయలు పరిహారంగా ఇస్తుందని అది సరిపోదని అలాగే అర్హులైన వారికి అనేక నిబంధనలు పెట్టి చాలా మందిని తొలగిస్తోందన్నారు. ఇళ్లకు 350 విద్యుత్ యూనిట్లు దాటినా, 110 చదరపు గజాలు ఇల్లు, లక్ష ఇరవై వేల రూపాయల ఆదాయం ఉంటే వారికి ఇవ్వకుండా అసంబద్ధత నిబంధనలతో వారికి పరిహారం ఇవ్వడం లేదన్నారు  ప్రస్తుతం కాకినాడ నగరంలో ఏనాడో ప్రభుత్వం అందించే గృహాల్లో చాలామంది మత్స్యకార కుటుంబాల వారు తలదాచుకుంటున్నారని వారికి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే అతను మృతదేహం దొరికితేనే పరిహారం ఇస్తామని సూచించే నిబంధన తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.  మత్స్యకారులకు మేలు చేసేలా జీవోలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం  మత్స్యకారులను ప్రభుత్వం తప్పుడు లెక్కలను చెబుతోందని దాన్ని సరి చేయాలన్నారు. కాకినాడ కుంభాభిషేకం రేవులో సముద్రం పై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని దీన్ని అడ్డుకుంటామని మనోహర్ భరోసా కల్పించారు. సీఎం జగన్ అవగాహన లేని విధానాల వల్ల అన్ని వృత్తుల వారు అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నారని ఆయన చెప్పారు. అంతకుముందు జనసేన పార్టీ మత్స్యకార విభాగం అధ్యక్షుడు బొమ్మిడి నాయకర్ జనసేన ఆశయాలను, అధినేత పవన్ కళ్యాణ్ విధానాలను వివరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతపత్రాన్ని మత్స్యశాఖ జేడి కార్యాలయంలో అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముత్తా శశిధర్, పంతం నానాజీ, కందుల దుర్గేష్, తుమ్మల బాబు, మాకినీడి శేషకుమారి, వరుపుల తమ్మయ్య బాబు, వేగుళ్ల లీలా కృష్ణ, సంగిశెట్టి అశోక్, కడలి ఈశ్వరి, సుంకర కృష్ణవేణి, బొంతు రాజేశ్వరరావు, డిఎంఆర్ శేఖర్, టీవీ రామారావు, పోలిశెట్టి చంద్రశేఖర్, రెడ్డి అప్పలనాయుడు, పితాని బాలకృష్ణ బద్దిరెడ్డి రాము, శెట్టిబత్తుల రాజబాబు, పాఠంశెట్టి సూర్యచంద్ర, బండారు శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ, మేకా విశ్వనాథ్, తుమ్మల చందు, తదితరులు పాల్గొన్నారు.