May 26,2022 10:53

న్యూఢిల్లీ :   జ్ఞానవాపి మసీదు కేసును వారణాసి సివిల్‌ జడ్జి నుండి జిల్లా జడ్జికి బదిలీచేయాలంటూ ఈనెల 20 సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పుడు సంకేతాలను చూపుతున్నాయి.

సివిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మసీదు మేనేజ్‌మెంట్‌ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాశీ విశ్వనాథ దేవాలయం సమీపంలో ఉన్న మసీదు ప్రాంతంలో దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయేమో వీడియో చిత్రీకరించడం ద్వారా సర్వే చేపట్టాలని ఆదేశించింది. మసీదులో దేవుని విగ్రహాలు, దేవాలయ ఆనవాళ్లు ఉన్నాయంటూ హిందూ సమితి వాదిస్తోంది. సర్వే అనంతరం మసీదులో శివలింగం ఉందంటూ హిందువుల తరపు న్యాయవాదులు బృందం పేర్కొంది. దీంతో శివలింగంతో పాటు ఆ ప్రాంతాన్ని మూసివేయాలని, సిఆర్‌పిఎఫ్‌ బలగాలతో భద్రత కల్పించాలని గతంలో సివిల్‌ జడ్జి జిల్లా మెజిస్ట్రేట్‌ను ఆదేశించారు.

ఈ ఆదేశాలను రద్దు చేయాలంటూ మసీదు మేనేజ్‌మెంట్‌ కమిటీ సివిల్‌ కోర్టును కోరింది. వీడియోగ్రఫి సర్వే నివేదిక ప్రార్థన స్థలాల (ప్రత్యేక నియమావళి) చట్టం - 1991ని ఉల్లంఘిస్తోందని మసీదు మేనేజ్‌మెంట్‌ కమిటీ పేర్కొంటోంది. 1947 ఆగస్టు 15 నాటికి ఉనికిలో ఉన్న ఏ ప్రార్థన స్థలం యొక్క మత స్వభావాన్ని మార్పులు చేయాలంటూ సూట్‌ వేయరాదనీ, న్యాయ విచారణలు చేపట్టరాదని ఆ చట్టంలోని సెక్షన్‌ 4లో స్పష్టంగా పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు, లేదా బృందాలు పాక్షికంగా లేదా పూర్తిగా, అదే మతానికి చెందిన,లేదా వేరే మతానికి చెందిన వ్యక్తులు తమ మతపరమైన ప్రదేశంగా సూచించినంత మాత్రాన ఆ ప్రాంతం వేరే మతానికి చెందదని పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వులను ఆమోదించడానికి సివిల్‌ జడ్జికి అధికార పరిధి లేనందున, పేర్కొన్న చట్టాన్ని అందించనందున దావా థ్రెషోల్డ్‌ వద్ద తిరస్కరించబడుతుందని సుప్రీంకోర్టులో వాదించారు. సిలివ్‌ జడ్జి ఈ వ్యాజ్యాన్ని కొనసాగించడమే కాకుండా ముస్లింలు నమాజ్‌ చేయడానికి అడ్డకింగా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారని వాదించారు. రక్షిత ప్రదేశానికి దగ్గరగా ఉన్న కొలనును వుజు( నమాజు ముందు శుద్ద్ధి కార్యక్రమం) నిర్వహించడానికి అనుమతించలేదని, దీంతో మసీదు మత స్వభావాన్ని మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. సివిల్‌ కోర్టులో విచారణను నిలిపివేయాలని కమిటీ కోరింది.

సివిల్‌ జడ్జి వ్యాజ్యాన్ని స్వీకరించడానికి అధికార పరిధి ఉందా లేదా అనే విషయాన్ని మొదట ఆర్డర్‌ చేయడం తప్పనిసరి అనే అభిప్రాయం ఉన్నప్పటికీ.. సివిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో ఎటువంటి తప్పులేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అధికార పరిధి ఉన్న అనంతరమే ఉత్తర్వులను పాస్‌ చేయాలి. కానీ సుప్రీంకోర్టు దృష్టిలో ఇది తీవ్రమైన ఉల్లంఘన కాదని తెలుస్తోంది. ఒకవేళ ఉల్లంఘనగా భావించి ఉంటే ఆదేశాలను పక్కన పెట్టడం, లేదా మార్చడం, లేదా వాదనలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించేది.
అత్యున్నత న్యాయస్థానం సివిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను దృవీకరించింది. సివిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేసినప్పటికీ.. జడ్జి పక్షపాతంతో వ్యవహరించాడని, సమర్థుడు కాదని ఎవరూ ఆరోపించలేదు. కేసును బదిలీ చేయమని ఎవరూ కోరలేదు. అటువంటప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసును జిల్లా కోర్టుకు ఎందుకు బదిలీ చేసింది అనేది ప్రశ్నార్థకం.ఈ కేసు రెండు మతాల మధ్య ఉండటంతో సంక్లిష్టత, సున్నితత్వానికి సంబంధించినది కావడంతో అనుభవజ్ఞుడై సీనియర్‌ న్యాయాధికారి పరిష్కరించాల్సి అవసరం ఉంది. అంటే సివిల్‌ జడ్జికి ఈ అంశాన్ని నిర్ణయించే సామర్థ్యం లేదని అర్థం. అనుభవజ్ఞుడైన సీనియర్‌ న్యాయమూర్తి చేపట్టే సంక్లిష్టమైన అంశం అన్న విషయాన్ని ఎవరు నిర్ణయిస్తారు. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, హైకోర్టు రూల్స్‌, ఆర్డర్‌లు సివిల్‌ జడ్జి అధికార పరిధిని నిర్ణయించినపుడు సమస్య సంక్ష్లిష్టంగా ఉందనే అభ్యర్థనపై ఎందుకు తీసివేయాలి అనేది మరో ప్రశ్న.

ముస్లిం పాలకులు దేవాలయాలను కూల్చివేసి మసీదులు నిర్మించారంటూ హిందూసంఘాలు మసీదులపై దావా వేయడం ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ రోజు జ్ఞానవాపి మసీదు., రేపు మథురలోని షాహీ ఈద్గా మసీదు, మరో రోజు భోపాల్‌లోని జామామసీదు కావచ్చు. ఇవన్నీ కూడా జ్ఞానవాపి మసీదుకు భిన్నంగా ఉండబోవు. దేశ సామాజిక వ్యవస్థను చీల్చుతున్న ఈ మతపిచ్చి ఎప్పటికి ముగుస్తుందో తెలియదు. ఇలాంటి కేసులు సుప్రీంకోర్టుకు వస్తూనే ఉంటాయి. ఈ కేసులన్నింటినీ సమస్య సంక్లిష్టత, సున్నితత్వం పేరుతో జిల్లాలకు బదిలీ చేస్తారా..అయితే సివిల్‌ జడ్జిలు ఎందుకు.. జిల్లా జడ్జికి బదిలీ చేయడం ద్వారా అనారోగ్యకరమైన పరిస్థితిని ఎదుర్కొవాల్సి వస్తుంది.అది న్యాయవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా బాధిత పక్షం పిటిషన్‌ వేసే హక్కును కూడా ఇది తొలగిస్తుంది.

ఇటీవల చాలా కేసుల్లో కింది న్యాయస్థానాలు పౌరుల స్వేచ్ఛకు సంబంధించి గతంలో లేనటువంటి అత్యుత్తమ ఉత్తర్వులను జారీ చేశారు. అందులో సందేహం లేదు. వారిసామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు. క్రింది కోర్టులు మన న్యాయవ్యవస్థకు పునాదులు వంటివి.. వాటి స్థానాన్ని తక్కువ చేయడం సరికాదు.