పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో వేగవంతంగా రీ సర్వే పనులు చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డికి కలెక్టర్ బసంత్ కుమార్ వివరించారు. గురువారం విజయవాడ నుంచి ముఖ్య కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్ పాల్గొన్నారు. ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ, జాతీయ రహదారులకు భూ సేకరణ, గహ నిర్మాణాలు, భూముల రీ సర్వే పనులు వేగవంతం కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రీ సర్వే పనులు వేగవంతంగా చేపడుతున్నామని, జాతీయ రహదారులకు భూ సేకరణ ప్రక్రియ నిర్ధేశిత గడువులోగా పూర్తి చేస్తామన్నారు. 15 రోజుల్లో సేకరించి 350 హెక్టార్ల భూమిని ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. రహదారులకు భూములు కోల్పోయిన రైతులకు న్యాయపరమైన పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాయింట్ కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో రీ సర్వే పనులు పకడ్బందీగా చేపడుతున్నామన్నారు. రీ సర్వేలో రెండు రకాల సమస్యలు వస్తున్నాయని, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రీ సర్వేలో మొబైల్ మెజిస్ట్రేట్‌లను ఏర్పాటు చేసి రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రీ సర్వే సకాలంలో పూర్తి చేస్తామని, గహ నిర్మాణాలను వేగవంతం చేసి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో వందశాతం ఈ-పంట నమోదు
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్‌లో వంద శాతం ఈ పంట నమోదు, 96 శాతం ఈకేవైసీ పూర్తి చేశామని కలెక్టర్ బసంత్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 95,538 ఎకరాలలో వరి వేరుశనగ మొక్కజొన్న తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారన్నారు. సాగు చేసిన పంటలన్నింటికీ వ్యవసాయ శాఖ గ్రామ వ్యవసాయ సహాయకులు ఇప్పటివరకు వంద శాతం పూర్తిగా ఈ పంట నమోదు చేశారన్నారు. నమోదు అయిన పంట వివరాలను రైతులు సరిచూసుకోవాలన్నారు. ఈకేవైసీ ఇంకా చేయించుకోని వారు మార్చి 4వ తేదీ లోపు నమోదు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.










