అమరావతి : తూర్పు గోదావరి-విశాఖ మన్యం ప్రాంతంలో లేటరైట్ తవ్వకాల ముసుగులో బాక్సైట్ తవ్వకాలకు పాల్పడుతున్నారని టిడిపి తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సైట్ తవ్వకాల కోసమే అక్కడ రోడ్డు నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తూ.. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడిలో భారీ నిరసన తెలిపారు. ఈ క్రమంలో టిడిపి చేస్తున్న ఆరోపణలపై ఎపి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. విజయవాడలో శనివారం మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది దీనిపై వివరణ ఇచ్చారు. విశాఖ జిల్లాలో 6 లేటరైట్ గనులు ఉండగా.. వాటిలో 5 పనిచేయడం లేదని వెల్లడించారు. ఒక్కదానికే లీజు అనుమతులు ఇచ్చామని, అది కూడా 5 వేల టన్నుల తవ్వకాలకే అనుమతి ఇచ్చామని వివరించారు. కొన్ని గనులకు సంబంధించిన లీజులపై కోర్టు వివాదాలు నడుస్తున్నాయని, హైకోర్టు తీర్పు మేరకు ఒక్క గనిలో మాత్రమే తవ్వకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. అక్రమ తవ్వకాలు జరుపుతున్న వారిపై జరిమానాలు విధిస్తున్నామని స్పష్టం చేశారు. కాగా, ఈ ప్రాంతంలో ఉన్న ఖనిజం లేటరైట్ అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలోనే వెల్లడించిందని పేర్కొన్నారు. తద్వారా ఈ గనుల్లో లభ్యమవుతున్న ఖనిజం లేటరైట్ అని, బాక్సైట్ కాదని స్పష్టమవుతోందని తెలిపారు.










