Nov 25,2022 21:33

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ

ప్రజాశక్తి-హిందూపురం: పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో జిల్లా అసుపత్రి స్థాయిలో సౌకర్యాలు కల్పించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. శుక్రవారం స్థానిక పురపాలక సంఘం పరిధిలో 19వ వార్డు ఇందిరా నగర్‌లో రూ.80లక్షలతో నూతనంగా నిర్మించిన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, వైస్‌ ఛైర్మన్లు జబివుల్లా, బలరామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎన్‌హెచ్‌ఎం డిపిఎంఒ డాక్టర్‌ కుళ్లాయప్ప నాయక్‌ మాట్లాడుతు జిల్లా వ్యాప్తంగా 18 పట్టణ ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయన్నారు. ఇందులో ఇప్పటికే 5 భవనాలు ఉన్నాయని, మిగిలిన 13 భవనాలను నూతనంగా నిర్మాణం చేసి ప్రారంభిస్తున్నామన్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తారన్నారు. అత్యవసర సేవలు సైతం ఆరోగ్య కేంద్రంలో చూస్తారన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతు అన్ని అసుపత్రుల్లో అవసరమైన అన్ని ప్రాథమిక సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి కృష్ణారెడ్డి, వైద్యులు ఆనంద్‌కుమార్‌, సాయి సుప్రిత, కౌన్సిలర్లు జయప్ప, మల్లికార్జున, రహమత్‌బి, మణి, నాగేంద్ర బాబు, రోషన్‌, గిరీష్‌, వెంకటేష్‌రెడ్డి, బాబు, కో-ఆప్షన్‌ మెంబర్‌ రహమత్‌, నాయకులు లతీఫ్‌ సేఠ్‌, సోమశేఖర్‌ రెడ్డి, ధనుంజయరెడ్డి,లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.