ప్రజాశక్తి-విజయవాడ
అత్యంత విలువైన ప్రాణాన్ని మధ్యలోనే చిదిమివేసి ఆత్మహత్యలకు పాల్పడటం మహా పాపమని, జీవితం విలువ వెలకట్టలేనిదని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చైన్‌లైన్స్ సంస్థ రూపొందించిన ''నేనున్నాను అని చెప్పాల్సిన బాద్యతను గుర్తు చేసే రోజు'' పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మనిషి పోగొట్టుకున్న దానిని ఏదైనా తిరిగి సాధించ వచ్చునని, సాధించలేనిది ప్రాణం ఒక్కటేనని, అంతటి విలువైన ప్రాణాన్ని మధ్యలోనే చిదిమి వేయడం ఎంత వరకు సమంజసమని ఒక సారి ఆలోచించాలని కోరారు. సమస్యలను ధైర్యంగా ఎదిరించాలని , ఆత్మహత్య అనే ఆలోచనను తరిమి కొట్టాలని అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఫోరంఫర్ చైల్డ్ రైట్ రైట్స్ డైరెక్టర్ బిఎస్ కోటేశ్వరరావు, చైల్డ్ లైన్ డైరెక్టర్ నోయల్ హార్బర్, జిల్లా కోఆర్డినేటర్ ఎ రమేష్, సిటీ కోఆర్డినేటర్ పి నాగరాజు పాల్గొన్నారు.










