Apr 05,2023 21:17

జగనన్న లే అవుట్లలో దొంగల బెడద


సిమెంట్‌, ఇటుకలు, కడ్డీలు మాయం
ఆందోళనలో లబ్ధిదారులు
పట్టని అధికారులు
ప్రజాశక్తి రాయచోటి : జిల్లా కేంద్రంలోని నారాయణరెడ్డిగారిపల్లి వద్దనున్న జగనన్న కాలనీ లేవుట్‌లో దొంగల బెడద అధికమైంది. జిల్లా వ్యాప్తంగా 496 జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. జిల్లాలో రూ.73,756 గహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.13.24 కోట్ల నిధులు కేటాయించారు. ఒక్క గహానికి రూ.1.80 లక్షల నిధులతో మంజూరు చేశారు. జిల్లా వ్యాప్తంగా రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోనూ జగనన్న నివేసన స్థలాలు ఇచ్చారు. వేలాది మంది నిర్మాణ పనులు చేస్తున్న తరుణంలో దొంగలు బెడద ఎక్కువైంది. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన సిమెంట్‌, ఐరన్‌తో పాటు లబ్ధిదారులు సొంతంగా ఇసుక, ఇటుకలు తదితర నిర్మాణ సామగ్రి అపహరణకు గురువుతన్నాయి. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. లేవుట్‌ జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్లు దూరం ఉండడం, సరైన రక్షణ లేకపోవడంతో దొంగలు బెడద ఎక్కువగా ఉంది. అసలే లేబర్‌ కూలీలు, బేల్దారి, ఇసుక, ఇటుకలు ధర ధరలు అధికం ఉండడంతో సామగ్రి రాత్రి వేళల్లో మాయం కావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలోనే ఈ విధంగా ఉంటే మారుమూల గ్రామాలలో పల్లెలకు దూరంగా ఉన్న లే అవుట్లలోని వారి పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం అధికారులకు విన్నవించినా ఫలితం కనిపించడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గహ నిర్మాణ శాఖ, పోలీసులు చర్యలు తీసుకోవాలని దొంగలను నివారించాలని, లేవుట్‌ వద్ద పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తమ దష్టికి రాలేదు
జగనన్న కాలనీల్లో దొంగతనం జరుగుతున్నట్లు తమ దష్టికి రాలేదు. కాలనీలకు సంబంధించిన తమ శాఖ అదికారులు డిఇ, ఎఇలు అందుబాటులో ఉంటారు. లబ్ధిదారులు ఎవరైనా అధికారుల దష్టికి తీసుకెళ్తే పోలీసులకు ఫిర్యాదు చేసిన చోరీల నివారణకు చర్యలు తీసుకుంటాం.
- శివయ్య, హౌసింగ్‌ పీడీ, రాయచోటి.
- చోరీకి గురవుతున్న లబ్దిదారులకు చెందిన ఇసుక, సిమెంట్‌