అమరావతి : అక్రమాస్తుల కేసులో ఎపి సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసిపి ఎంపి రఘురామకృష్ణరాజు సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. తమ వాదనలను జగన్, రఘురామ లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించారు. అయితే, తాము లిఖితపూర్వక వాదనలు సమర్పించబోవడం లేదని సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.
కాగా, అక్రమాస్తుల కేసులో సిఎం జగన్ బెయిల్‌పై బయటు ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించారంటూ వైసిపి రెబెల్ ఎంపి రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు రిజాయిండర్ కూడా వేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 1న జరిగిన విచారణ సందర్భంగా లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని జగన్, రఘురామకృష్ణరాజు, సిబిఐని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు జగన్, రఘురామ లిఖితపూర్వక వాదనలు నేడు విచారణ సందర్భంగా సమర్పించారు. అయితే, తాము లిఖితపూర్వక వాదనలు సమర్పించబోవడం లేదని సిబిఐ అధికారులు కోర్టుకు తెలపడంతో తదుపరి విచారణను వాయిదా వేసింది.










