Apr 06,2023 08:19
  • ఉత్తర్వులు ఇవ్వడంలో కమిషనర్‌ తాత్సారం

ప్రజాశక్తి - కరూులు ప్రతినిధి : గత ఏడాది కావేరీ జాదూ కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన పత్తి రైతులకు నేటికీ పరిహారం అందలేదు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లోని 1,889 మంది రైతులు 7,258 ఎకరాల్లో జాదూ కల్తీ విత్తనాలను సాగు చేసి నష్టపోయారు. సాధారణంగా ఒక ఎకరా సాగుకు రూ.50 వేల నుంచి రూ.60వేల వరకు ఖర్చు అవుతుంది. ఎకరాకు 12 నుంచి 13 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉండగా ఈ కల్తీ విత్తనాల వల్ల ఒక క్వింటా మాత్రమే దిగుబడి వచ్చింది. రైతు సంఘం పోరాటాల ఫలితంగా కల్తీ విత్తనాల వ్యవహారంపై నంద్యాల శాస్త్రవేత్తలు పలు ప్రాంతాల్లో పర్యటించి నమూనాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. 50 నుంచి 70 శాతం నకిలీ విత్తనాలు ఉండటం వల్లే పంట దిగుబడి తక్కువ వచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వ కమిటీ రైతులతో చర్చించి ఎకరాకు రూ.23,370 పరిహారాన్ని అవార్డు ప్రకటించింది. కర్నూలు జిల్లాలో మొత్తం రూ.16.96 కోట్లు పరిహారాన్ని కావేరీ జాదు కంపెనీ చెల్లించాల్సి ఉంది. పరిహారం నుంచి తప్పించుకునేందుకు జనవరి 29న హైకోర్టును ఆశ్రయించింది. ఈ అంశాన్ని వ్యవసాయ శాఖ కమిషనర్‌ దగ్గర తేల్చుకోవాలని కేసును హైకోర్టు సస్పెండ్‌ చేసింది. రైతులకు జాదూ కంపెనీ పరిహారం చెల్లించాలని ఉత్తర్వులు ఇస్తే సదరు కంపెనీ రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఆ ఉత్తర్వులు ఇవ్వడంలో జాప్యం ప్రదర్శిస్తున్నారు.

  • పరిహారం అందించాలి

జాప్యం లేకుండా రైతులకు పరిహారం అందించేలా చూడాలి. కమిషనర్‌ ఉత్తర్వులు ఇవ్వడంలో జాప్యం ప్రదర్శిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఆందోళనలు, రాస్తారోకో చేపట్టాం. ఆందోళనను కొనసాగిస్తాం.
- జి.రామకృష్ణ, రైతు సంఘం కరూులు జిల్లా ప్రధాన కార్యదర్శి.