దేశ స్వాతంత్య్రోద్యమంలో తెలుగువారి పాత్ర అద్వితీయమైనది. పురుషులతో పాటు స్త్రీలూ అసమాన త్యాగాలు చేశారు. మొత్తం 186 మంది వనితలు స్వాతంత్య్ర సమరాంగణంలో వీరోచితంగా పోరాడారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 59 మంది మహిళలు పాల్గొన్నారు. నాటి ఆంధ్రప్రదేశ్‌లో ఏ నగరంలోనూ 12 మంది మహిళలు స్వాతంత్య్ర సమరంలో జైళ్లకు వెళ్లలేదు. కానీ ఒక్క రాజమహేంద్రికే ఆ ఘనత దక్కింది. వీరి మహోన్నత వారసత్వాన్ని భావితరాలు అందిపుచ్చుకోవాలి. అసలైన దేశభక్తి సర్వమానవ సౌభ్రాతృత్వమే !
శ్రీకాకుళం జిల్లా శశిమాను గున్నమ్మ అటవీ చట్టాలను ధిక్కరించే సమయంలో నిండు గర్భిణి. ఆ పోరాటంలో ఆమె అమరత్వం పొందింది. ఈ జిల్లాలో ఐదుగురు స్త్రీలు జైలుకు వెళ్లారు. వీరిలో కప్పగంతుల ఆదిలక్ష్మి హరిజనాభ్యుదయ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. దువ్వాడ బాలకృష్ణమ్మ మందసా రైతు ఉద్యమంలో పాల్గొని, 1940లో ఏడాదిపాటు కఠిన కారాగారం అనుభవించారు. హెచ్.సత్యభామాబాయి 1940లో సత్యాగ్రహం చేసి, వెల్లూరు, కడలూరులో జైలు శిక్ష అనుభవించారు. జయంతి సూరమ్మ 1930లో ఆరు నెలలు వెల్లూరు జైల్లో, 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని వెల్లూరు, కడలూరు కారాగారాల్లో 15 నెలలు శిక్ష అనుభవించారు.
విజయనగరంలో టేకుమళ్ళ కుటుంబం నుంచే నలు గురు మహిళలు జైలుకు వెళ్లారు. వారు టేకుమళ్ళ బుచ్చి రామాయమ్మ, మహాలక్ష్మమ్మ, సీతారామమ్మ, వరాహలక్ష్మి. ఈ జిల్లాలోనే మంత్రిప్రగడ బంగారమ్మ 1930లో ఏడున్నర నెలలు వెల్లూరు జైల్లో కఠినశిక్ష అనుభవించి, 1948లో మరణించారు. భానగరపు అనసూయమ్మ క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు శిక్ష పొందారు. విశాఖ జిల్లా దిమిలి గ్రామంలో శిష్ట్లా లక్ష్మీనర్సమ్మ, లింగమ్మ, సోదెమ్మ, శ్యామసుందరమ్మ ఉద్యమాల్లో పాల్గొని, జైలుశిక్ష అనుభవించారు. మిస్సుల లక్ష్మీనర్సమ్మ ఆరునెలల పాటు, కాల్నాధభట్ల మహలక్ష్మమ్మ, గాదె నారాయణమ్మ, దర్భా వేంకట రమణమ్మ జైలు శిక్ష అనుభవించారు.
తూర్పు గోదావరి జిల్లా నుండి భార్యాభర్తలు కాశీభట్ల వేంకట రమణమ్మ, లక్ష్మీనరసింహారావు; పాలకోడేటి శ్యామలాంబ, సూర్యప్రకాశరావు జమిలిగా జైలుకెళ్లారు. బారు అలివేలమ్మ, సింహాద్రి అన్నపూర్ణాదేవి, పందిరి జగదాంబ, పెద్దాడ కామేశ్వరమ్మ, మానుగంటి లక్ష్మీనర్సమ్మ, మానాప్రగడ రామసుందరమ్మ, భమిడిపాటి రంగనాయకమ్మ, రాచర్ల సామ్రాజ్యం తదితర మొత్తం 21 మంది స్త్రీలు పాల్గొన్నారు.
1932లో సరోజినీనాయుడు అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నిరసన సభలో వేదాంతం కమలాదేవి అరెస్టయ్యారు. దువ్వూరి సుబ్బమ్మ భర్త చనిపోయిన ఒంటరి మహిళ. ఒకసారి పోలీసు 'మా పాలన ఎలా ఉంది?' అనడిగితే.. ఆమె తన తల మీద తెల్ల కొంగును తొలగించి, గుండును చూపిస్తూ 'ఇలా ఉంది' అని ధీటుగా చెప్పారంట. స్వాతంత్య్ర పోరాటంలో దుర్గాబాయి దేశ్‌ముఖ్ పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గాంధీజీ పర్యటనకు వచ్చినప్పుడు తన బంగారు వస్తువులన్నింటినీ ఇచ్చేసిన తొలి మహిళ మాగంటి అన్నపూర్ణాదేవి. ఉద్దరాజు మాణిక్యాంబ శాసనోల్లంఘన ఉద్యమంలో 10 నెలలు వెల్లూరు, కన్ననూరు జైళ్లలో శిక్ష అనుభవించారు. చింతపర్తి బుచ్చెమ్మ, దారా దమయంతీదేవి, కోటమర్తి కనకమహాలక్ష్మి ఎన్నోసార్లు లాఠీదెబ్బలు తిన్నారు. ఆరునెలలు జైలుశిక్ష అనుభవించారు. కొవ్వలి కనకమ్మ, దాసరి కృష్ణవేణమ్మ, దామరాజు లక్ష్మమ్మ, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ, ముడుంబ లక్ష్మీదేవి, మంతెన లక్ష్మీనర్సమ్మ, శృంగారకవి లక్ష్మీనర్సమ్మ, వెలమాటి మాణిక్యాంబ, కంది నాగరత్నమ్మ, పాలకోడేటి నాగరత్నమ్మ, దాట్ల నర్సమ్మ, కలగర పిచ్చమ్మ, వద్దిపర్తి శకుంతల, కొటికలపూడి సరస్వతీదేవి, వారణాసి సీతమ్మ, అద్దునూరి సీతారామమ్మ, వేగేశ్న సుభద్రాదేవి, బారదవాడ సూరమ్మ, ముడుంబ వెంకటమ్మ, గోకరాజు వెంకాయమ్మ మొత్తం 27 మంది మహిళలు సత్యాగ్రహంలో పాల్గొని, జైలుశిక్ష అనుభవించారు.
కృష్ణాజిల్లాలో మహిళాయోధుల్లో ఎందరో మహోన్నతులు ఉన్నారు. మల్లిరెడ్డి అన్నపూర్ణమ్మ, సూరపునేని అన్నపూర్ణమ్మ, వల్లభనేని అన్నపూర్ణమ్మ, అట్లూరి కామేశ్వరమ్మ, జాగర్లమూడి కామేశ్వరమ్మ, గొర్రెపాటి కుటుంబమ్మ, చెరుకూరి కృష్ణవేణమ్మ, గుత్తికొండ లక్ష్మమ్మ, బొప్పన లక్ష్మీకాంతమ్మ, గొర్రెపాటి లక్ష్మీకాంతమ్మ, కొల్లిపర లక్ష్మీకాంతమ్మ, గోనుగుంట్ల లక్ష్మీకాంతమ్మ, కోటగిరి మంగతాయారమ్మ, అరికెపూడి మాణిక్యాంబ, మనోరమ, వల్లభనేని సీతామహలక్ష్మమ్మ, గుత్తికొండ సీతమ్మ, కొల్లిపర సీతమ్మ, వారణాసి సీతమ్మ, నూతక్కి సీతారామమ్మ, గుళ్ళపల్లి సీతారామమ్మ, సీతంరాజు సీతారామమ్మ, తంగిరాల సీతారామమ్మ, పాదుర్తి సుందరమ్మ, పునూరి సుందరమ్మ మొత్తం 25 మంది మహిళలు వెల్లూరులో నెలల నుంచి ఏడాది పాటు జైలుశిక్ష అనుభవించారు.
గుంటూరు జిల్లాలో 'మాలపల్లి' నవల రాసిన ఉన్నవ లక్ష్మీనారాయణ భార్య ఉన్నవ లక్ష్మీబాయమ్మ, బసవరాజు అప్పారావు సతీమణి రాజ్యలక్ష్మి వంటివారు ఉద్యమంలో ఉన్నారు. సత్తెనపల్లిలో మాణిక్యాంబ, తెనాలి తాలూకా నుండి ఏడుగురు, రేపల్లె తాలూకాలో 12 మంది మహిళలు జైలుశిక్ష అనుభవించారు. మంతెనవారిపాలెంలో ఐదుగురు స్త్రీలు, పండితారాధ్యుల సత్యవతమ్మ పేరు గల ఇద్దరు స్త్రీలు రేపల్లె నుండి జైలుకెళ్లారు. కాళంగి శేషమాంబ కూడా జిల్లా నుండి అరెస్టయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా 59 మంది స్త్రీలు గుంటూరు జిల్లా నుండే పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలో 1921, 1922లలో 'పన్ను నిరాకరణ ఉద్యమం'లో కోట సుందరమ్మ పన్ను కట్టటానికి నిరాకరించింది. పీసుపాటి త్రిపురాంబ ఈ జిల్లా నుంచే పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో పొణకా కనకమ్మ గ్రంథాలయ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తే.. తిక్కవరపు సుందరమ్మ హరిజనోద్యమంలో నేతృత్వం వహించారు. పాటూరు బాలసరస్వతమ్మ 1930-32 ఉద్యమాల్లో పాల్గొని, అరెస్టయ్యారు. 'శశి' అనే మాసపత్రికను నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్‌గా సేవలందించారు. ముత్తుకూరు కామమ్మ, వేనాటి చెంచులక్ష్మమ్మ, బెజవాడ లక్ష్మీకాంతమ్మ, ఓరుగంటి మహలక్ష్మమ్మ, చవ్వాకుల మైత్రేయి దేశభక్తి గేయాలతో ప్రజలను ఉర్రూతలూగించారు. 26 మంది మహిళలు జాతీయోద్యమంలో పాల్గొని, జైలుశిక్ష అనుభవించారు. అనంతపురం జిల్లా ఇల్లూరు కేసమ్మ క్విట్టిండియా ఉద్యమంలో పాల్గొని, వెల్లూరు జైల్లో రెండు నెలలు కఠినశిక్ష పొందారు. చిత్తూరు జిల్లా నుండి తంబళంపల్లి నల్లప్పరెడ్డి శకుంతల ఎగ్మూరు మేజిస్ట్రేటు ఎదుట పికెటింగు జరపడం వల్ల వెల్లూరు జైల్లో ఆరు నెలల జైలుశిక్ష అనుభవించారు. తెలంగాణా ప్రాంతం నుండికొర్రా బుచ్చమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, సంగం లక్ష్మీబాయి, పద్మజానాయుడు తదితరులు సమరశీలంగా పోరాడారు. ... ఇలా ఎందరెందరో చేసిన పోరాటాల, త్యాగాల ప్రతిఫలం మన స్వాతంత్య్రం. సమైక్యత, సామరస్యం, స్వావలంబన కోసం ఈ స్ఫూర్తితో ఇప్పుడూ కులమతాలకు అతీతంగా మహిళలు కృషిచేయాలి.
రాష్ట్రంలో ఇంతమంది మహిళలు మహోన్నత పోరాటం చేశారు. ఈ పోరాటంలో కాగడా పెట్టి వెతికినా కాషాయదళాలు కనిపించని వైనం. అసలైన జాతీయోద్యమ వారసులు ఎవరో తేటతెల్లం చేస్తోంది.
- శాంతిశ్రీ

మతాన్ని (హిందూ మతం, ఇస్లాం వంటి అర్ధంలో) రాజకీయాన్ని దేనికదిగా వేరువేరుగా వుంచాలి. మతాన్ని రాజకీయాల్లోకి, పబ్లిక్ లోకి తీసుకురాకూడదు. దాన్ని వ్యక్తి యొక్క ప్రయివేటు వ్యవహారంగానే చూడాలి.
- గాంధీజీ

లౌకికవాదం అంటే మతం లాంటి దాన్ని నిరుత్సాహపరిచేది ఎంతమాత్రం కాదు. మత స్వేచ్ఛ, మతం లేని వారి స్వేచ్ఛ, అందరి వ్యక్తిగత సత్ప్రవర్తనా స్వేచ్ఛ అని దానికి అర్ధం. ఇతర మత వ్యవహారాల్లో, మన రాజ్య మౌలిక స్వభావంలో జోక్యం చేసుకోనంతవరకూ అన్ని మతాలకూ వ్యవహార స్వేచ్ఛ వుంటుందని దానికి అర్ధం.
- నెహ్రూ










