శ్రీనగర్ : జాతీయ గీతం ప్రసారమవుతున్న సమయంలో నిలబడకపోవడం, జాతీయ గీతాన్ని ఆలపించకపోవడం వంటివి అమర్యాద కింద గుర్తించబడవని జమ్ము కాశ్మీర్ కోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. అలాగే రాజ్యాంగంలోని అవమానాలను నిరోధించే జాతీయ గౌరవ చట్టం 1971 ప్రకారం.. నేరం కాదనిజస్టిస్ సంజీవ్ కుమార్‌తో కూడిన ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. చట్టంలోని సెక్షన్ 3ని ఉటంకిస్తూ.. జాతీయ గీతం పాడేటపుడు అడ్డు కోవడం లేదా ప్రసారానికి పాడేందుకు సిద్ధమైనపుడు భంగం కలిగించడం వంటివి నేరాలుగా పరిగణింప బడతాయని, వాటికి జరిమానా విధించవచ్చని అన్నారు. జాతీయ గీతాన్ని గౌరవించడం అనేది ప్రాథమిక విధుల్లో ఒకటిగా రాజ్యాంగం పేర్కొందని, అయితే వీటిని చట్టం ప్రకారం నిర్బంధంగా అమలుచేయలేమని, ఉల్లంఘించడం నేరమూ కాదని కోర్టు పేర్కొంది. జాతీయ గీతం ప్రసారమైనపుడు శారీరక వికలాంగుడైన వ్యక్తి మాత్రమే నిలబడకుండా ఉండవచ్చని లేకుంటే సెక్షన్ 3 కింద శిక్షార్హులవుతారని 2019లో బిజెపి ఎంపి పర్వేశ్ శర్మ ఒక బిల్లును ప్రవేశపెట్టారు. కోర్టు ఈ బిల్లును తోసిపుచ్చింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల శిబిరాలపై సైన్యం చేపట్టిన సర్జికల్ దాడి మొదటి వార్షికోత్సవాన్ని 2018లో జమ్ము ప్రాంతంలోని ఒక కాలేజీలో నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో జాతీయ గీతం ప్రసారమవుతుండగా అదే కాలేజీకి చెందిన అధ్యాపకుడు తాసీఫ్ అహ్మద్ భట్ లేచి నిలబడలేదంటూ కొందరు విద్యార్థులు ఆయనపై నమోదు చేసిన కేసును కోర్టు కొట్టివేసింది. ఉద్దేశపూర్వకంగా లేదా ఇతరత్రా జాతీయ గీతాన్ని పాడటంతో నిమగమైన వ్యక్తులకు ఇబ్బంది కలిగించలేదని, ఆ సమయంలో కాలేజీ ఆవరణలో తిరుగుతుండటం వంటివి చేయలేదని కోర్టు పేర్కొంది. ఆయన తన కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని కోల్పోవడం ద్వారా ఇప్పటికే మూల్యం చెల్లించారని కోర్టు భావిస్తుందని అన్నారు. ఇదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా ఈ అంశంపై కేసులు నమోదవడం గమనార్హం.










