Apr 28,2023 08:12

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

      పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో ప్రజా అవసరాలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా కొరత రాకుండా అన్ని చర్యలూ చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు, ప్రభుత్వ పనుల నిర్మాణాలకు సరిపడా ఇసుక నిల్వ ఉంచాలని సూచించారు. జిల్లాలోని బత్తలపల్లి మండల పరిధిలోని దంపెట్ల, తాడిమర్రి మండల పరిధిలోని సిసి రేవుల్లో ఇసుక రీచ్‌లను కొత్తగా గుర్తించడంతో వాటిని కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా శాఖల ద్వారా అనుమతి పత్రాలు వచ్చిన వెంటనే ఈ రీచ్‌లు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్‌ తెలిపారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టవలసిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదనపు ఎస్పీ రామకష్ణ ప్రసాద్‌, గనుల శాఖ డిడి నాగయ్య, ఏడి రామకష్ణ, ఇరిగేషన్‌ ఈఈ ప్రతాప్‌, ఆర్‌కె ప్రసాద్‌, డిపిఒ విజరు కుమార్‌, ఆర్‌డబ్ల్యు ఎస్‌ఎస్‌సి రషీద్‌ ఖాన్‌, ఎంవిఐ శివ శంకర్‌ పాల్గొన్నారు.