Jul 22,2021 17:33

అమరావతి : మతాలు వేరైనా, కుటుంబాల కట్టుబాట్లు అడ్డొచ్చినా.. వారిద్దరి మనసులు కలవడంతో మనువాడారు. వివాహమాడిన కొద్దిసేపటికే ఆ నూతన జంటపై దాడి జరిగింది. గుంటూరుకు చెందిన ఈ ఘటన తాజాగా వెలుగులోకిచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిగకు చెందిన చందు, బేతపూడికి చెందిన కౌసర్‌ ప్రేమించుకున్నారు. పెళ్లికి ఇరువురు కుటుంసభ్యులు ఒప్పుకోకపోవడంతో.. ఈ నెల 19న గుంటూరులోని శేషాచలం ఆశ్రమంలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వారికి ప్రాణహాని ఉందని గ్రహించిన నూతన జంట ఆశ్రమం నుంచి నేరుగా వెళ్లి జిల్లా ఎస్పీని కలిసి రక్షణ కల్పించమని కోరారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఫిరంగిపురం పోలీసులు ఇరువర్గాల వారిని పిలిపించి నచ్చజెప్పారు. వధూవరులు పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఆటోలో ఇంటికి వెళ్తుండగానే యువతి తరపు బంధువులు దాడి చేసి వధువును అపహరించారు. ఆమెను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై చందు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజులైనా తన భార్య ఆచూకీ తెలియలేదని ఆందోళన చెందుతున్నాడు.