పొగ నింపుకున్న ప్రకృతి మధ్యలో
కొన ప్రాణంతో కొన్ని చెట్లు విగత జీవులై
ఒకే వేరుపై నిలబడి వుంటాయి
సరిహద్దులన్నీ సద్దుమణిగిన మౌనంలా
కాలిన బూడిదను పరుచుకుని
శ్వాసను కదిలిస్తుంటాయి
చిరిగిన మసిగుడ్డల గుడారాల కింద
కొన్ని జ్ఞాపకాలు మాడిపోయి కనిపిస్తాయి
ఫిరంగి గుండ్ల ఆనవాళ్ళు అక్కడక్కడ
కొన్ని అవయవాలపై నల్ల మచ్చలుగా
కమిలిపోయి కనబడతాయి
యుద్ధ తరంగాలు వాతావరణమంతా
నిండా కప్పుకుపోయి గగుర్పొడిచేలా
మనసును కదిలిస్తుంటాయి
పచ్చికబయలన్నీ బొగ్గుల్ని పోగు చేసుకుని
పచ్చదనానికి స్వస్తి పలికి
కళను వెలేసి వెలవెలబోయి కనిపిస్తాయి
రంగుల్ని నింపుకున్న పుర మేడలన్నీ
తలలు చిట్లిపోయిన పగుళ్ల మధ్య
బిక్కు బిక్కుమంటూ నిలుచుకొనుంటాయి
యుద్ధం తరువాయి మొత్తం
ఆర్థిక తూటాల సంక్షోభాల ధాటికి
వ్యవస్థ మొత్తం బీటలువారి కనిపిస్తుంది
కొన్ని సామాన్య దేహాలు కాలిన పైకప్పుల కింద
ఊపిరి పిడికిల్లో పట్టుకుని
ఆశగా ఎదురు చూస్తూ గడుపుతుంటాయి
కరిగిపోయిన కొవ్వొత్తుల్లా
నలిగిపోయిన కొన్ని బతుకులు
మగ్గిపోయి మరుగున దాగుంటాయి
ఆకలిదే పైచేయిగా విజృంభించిన తరుణంలో
కొన్ని ప్రాణాలు నిలకడ కోల్పోయి
ఎముకల గూడులో తొంగుంటాయి
యుద్ధం తరువాత
కొన్ని చెదిరిపోయిన దృశ్యాలు
చరిత్రగా పరిణమిస్తాయి.
- నరెద్దుల రాజారెడ్డి
సెల్ : 9666016636










