Apr 19,2023 21:37

ఫొటో : మాట్లాడుతున్న సిఐ సాంబశివరావు

యాసిడ్‌ దాడి కేసు ఛేదన
ప్రజాశక్తి-కలిగిరి : కలిగిరి మండల కేంద్రంలో ఇటీవల కాలంలో దంపతులపై జరిగిన యాసిడ్‌ దాడి ఘటన కేసును కలిగిరి సిఐ ఎస్‌.సాంబశివరావు నేతృత్వంలో పోలీసులు త్వరితగతిన ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సిఐ సాంబశివవరావు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏప్రిల్‌ 4వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో కలిగిరిలోని నటరాజు తోట సమీపంలో గుణపాటి నాగార్జునరెడ్డి అతని భార్య వెంకట రమణమ్మపై జరిగిన యాసిడ్‌ దాడి సంఘటనపై అప్పట్లో కేసునమోదు చేశామన్నారు. కలిగిరి శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న ఉండ్రగండ్ర నాగేంద్రబాబుకు, గుణపాటి నాగార్జునరెడ్డి, అతని భార్య వెంకట రమణమ్మలకు కుటుంబ కలహాలు ఉన్న నేపథ్యంలో పూజారి కుటుంబ వ్యవహారాలలో వారిద్దరూ జోక్యం చేసుకుని తన భార్య దూరమయ్యేలా చేశారని, అతనిపై లేనిపోని అసత్య ప్రచారాలు చేసి అతనిని నలుగురిలో తలెత్తుకోలేకుండా చేశారనే అక్కసుతో మిగతా నిందితులతో కలిసి కుట్రపన్ని నాగార్జునరెడ్డి, వెంకటరమణమ్మలపై యాసిడ్‌ దాడి చేయించారని తమ దర్యాప్తులో తేలిందన్నారు.
కాగా ఈ విషయమై కేసును ఛాలెంజ్‌గా తీసుకుని నిందితుల ఆట కట్టించామన్నారు. అందులో భాగంగా యాసిడ్‌ దాడి చేయించిన, దాడికి పాల్బడిన 11 మంది నిందితులలో 7 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. నిందితులను కావలి మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచనున్నట్లు సిఐ సాంబశివరావు తెలియజేశారు. సమావేశంలో ఎస్‌ఐ సూర్యప్రకాష్‌ రెడ్డి పాల్గొన్నారు.