యుద్ధాన్ని స్వప్నించడం
మూర్ఖుల కలలోనే సాధ్యమౌతుంది
ఆ విషాద స్వప్నంలో
కట్టుకున్న అద్దాల కలల మేడలు
కుప్పకూలిపోతాయి
నగరాలకు నగరాలు
రాత్రికి రాత్రే కనుమరుగైపోతాయి
దారులంతా నిశ్శబ్దంతో నిద్రపోతుంటాయి
యేరులంత రక్తంతో పారుతుంటాయి
అమ్మ ఒడిలో నిద్రబోతున్న పసిబిడ్డకు
తూటా తగిలి శాశ్వతంగా నిద్రిస్తుంది
సాయంత్రం వేళ కళకళలాడే బజార్లు
శవాల గుట్టలతో కాలిపోతుంటాయి
తల్లిదండ్రులు కాలమైపోతే
ఓ పసిబిడ్డ
గడ్డి తింటున్న దయనీయ దృశ్యాలు
కండ్లకు కన్నీళ్ళు తెప్పిస్తాయి
వాగు పక్కన సగం కాలిన యాజమాని
దేహాన్ని కుక్క పీక్కు తింటున్న
ఆకలి చిత్రం కనిపిస్తుంది
వందలేండ్లపాటు నిర్మించుకున్న పునాదులు
వేలయేండ్లనాటి చరిత్ర కాయిదాలు
బూడిదలో భగ్గుభగ్గున మండిపోతుంటాయి
ఏడేడు తరాల నాటి వారసత్వం
ఎన్నో జాతుల సాంస్క ృతిక సంపద
మూలాలు ముల్లెలు భాషలు యాసలు
యుద్ధం మంటలకు పరిసమాప్తం!
యుద్ధం ఈ నేలపై ఎక్కడ జరిగినా
విషాద గీతమే - దాని రూపాంతరం!
- అవని శ్రీ
99854 19424










