'ఉపాధి' సిబ్బందితో ఎంపిడిఒ సమీక్ష
ప్రజాశక్తి-సీతారామపురం : స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో గురువారం ఉపాధి హామీ సిబ్బంది, క్షేత్ర సహాయకులతో ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్ సమీక్ష నిర్వహించారు. మండలంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి వంద రోజులు ఉపాధి కల్పించే విధంగా అంచనాలు రూపొందించాలని, ప్రతిరోజు మండలంలో 3500 మంది కూలీలతో పనిచేయించే విధంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఉపాధి హామీ మేట్లతో ఉపాధి కూలీలతో అవగాహన సమావేశాలు నిర్వహించి ఎక్కువమంది పనులను సద్వినియోగపరుచుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉపాధి కూలీలు కొలతల ప్రకారం పని చేయాలని సూచించారు. ప్రభుత్వం రూ.257 నుండి రూ.272లకు రోజువారి వేతనాన్ని పెంపుదల చేసినందున ఉపాధి కూలీలు ఈ విషయాన్ని గమనించి ఎక్కువ వేతనం పొందే విధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయం 6 గంటలకే పని ప్రారంభించి ఉదయం 11 గంటల లోపు పనులు పూర్తి చేసుకోవాలన్నారు. గ్రూపుల వారీగా పనులు విభజించి ముందుగా మార్కింగ్ ఇచ్చి ఉపాధి కూలీలు పనులు చేసే లాగా టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ చర్యలు తీసుకోవాలని సూచించారు. పని ప్రదేశంలో తాగునీరు, నీడ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సిబ్బందికి తెలిపారు. కార్యక్రమంలో ఎపిఒ సుహాసిని, ఇసి సువార్తయ్య, టిఎలు తదితులున్నారు.










