'ఫ్యామిలీ డాక్టర్' విధానమే ప్రభుత్వ లక్ష్యం
- ఆత్మకూరు మండలంలో విస్తృత పర్యటనలో కలెక్టర్ హరినారాయణన్
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : కుటుంబ డాక్టర్ విధానం ద్వారా అందరికీ వైద్యం అందజేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆత్మకూరు మండలంలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. తొలుత ఆత్మకూరు మండలం, నల్లపరెడ్డిపల్లి గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో కుటుంబ కుటుంబ ప్రధానంలో గ్రామస్తులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరినారాయణన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కుటుంబ డాక్టరు విధానాన్ని గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందుకుగానూ గ్రామాలలో కుటుంబ డాక్టర్ విధానంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నప్పుడు గ్రామస్తులకు ముందస్తు సమాచారం ఇవ్వడం ద్వారా వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని వైద్యులకు సూచించారు. గ్రామాలలోని ప్రజలు వైద్యంకోసం జిల్లా కేంద్రాలకు వచ్చి ఇబ్బంది పడుతున్నారనే సదుద్దేశంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యాన్ని చేరువ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ డాక్టరు విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. రక్తహీనత కలిగిన చిన్నారులు, మహిళలు, గర్భిణులపై, సుగర్ వ్యాధిగస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు చేసుకునేందుకు వచ్చిన గ్రామస్తులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఆత్మకూరు మండలం, బట్టేపాడు గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీచేసి, రిజిస్టర్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో ఎంత మంది పిల్లలు ఉన్నారు.. వారికి సంబంధించిన వివరాలు సక్రమంగా నమోదు చేస్తున్నారా.. లేదా.. అని అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించిన పౌష్టికాహార వివరాలతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల ఆరోగ్య డేటాను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రక్రియలో ఎవరైనా అలసత్వం వహిస్తే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో రక్తహీనత ఉన్న గర్భిణులు, తక్కువ బరువు, తక్కువ ఎత్తు ఉన్న పిల్లల ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని, వారు వాడుతున్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద పౌష్టికాహారం అందించడంతో పాటు ఎనిమియా నివారణకు గర్భిణులకు సరైన విధానంలో పౌష్టికాహారాన్ని, మందులను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు తప్పని సరిగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని కలెక్టర్ వారికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పెంచలయ్య, ఐ.సి.డి.ఎస్. పిడి సౌజన్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద చేపడుతున్న సైడు కాలువల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆత్మకూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలోని కంటి పరీక్షల వార్డును, రక్త పరీక్షల విభాగాన్ని, వైద్య సేవ వార్డులను జిల్లా కలెక్టర్ సందర్శించి సంబంధిత రిజిస్టర్స్‌ను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్‌ను పరిశీలించారు. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పెంచలయ్య, డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ రమేష్‌నాథ్, ఆసుపత్రి సుపరింటెండెంట్ డాక్టర్ శేషారత్నం, ఆసుపత్రి డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.










