ప్రాజెక్టుల నిర్వహణ పట్టిష్టంగా ఉండాలి
ప్రజాశక్తి-సంగం : జిల్లా ప్రజలకు సాగునీరు, తాగునీరు సక్రమంగా అందేలా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ పటిష్టంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఆదేశించారు. శుక్రవారం తెలుగు గంగ ప్రాజెక్టు సిఇ హరినారాయణ రెడ్డి, సోమశిల ఎస్‌ఇ వెంకటరమణారెడ్డిలతో కలసి సంగంలోని మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని సందర్శించి, బ్యారేజీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బ్యారేజీకి అనుసంధానంగా చేపట్టిన ఇరిగేషన్ కెనాల్స్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం సంగం మండలం, కొరిమెర్ల గ్రామాన్ని సందర్శించి రక్తహీనత గల గర్భిణులు, తక్కువ బరువు, తక్కువ ఎత్తు ఉన్న పిల్లల ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని, వారు వాడుతున్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద పౌష్టికాహారం అందించడంతో పాటు ఎనిమియా నివారణకు గర్భిణులకు సరైన విధానంలో పౌష్టికాహారాన్ని, మందులను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు, తప్పని సరిగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద చేపట్టిన సిమెంటు రోడ్డును పరిశీలించారు. ఆయనవెంట ఐసిడిఎస్ పిడి సౌజన్య, సిడిపిఒ పద్మ, తహశీల్దార్ లక్ష్మి ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.










