మూడు నాలుగు దశాబ్దాల కిందటి మాట. అప్పుడు పిల్లల బాల్యం అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యల దగ్గర సురక్షితంగా గడిచిపోతుండేది. కాని అది ఇప్పుడు మగ్యమయింది. కారణాలు కోకొల్లలు. ఆ కాలంలో పెద్దలు తమ అనుభవాలను రంగరించి తమకు తెలిసిన కథలను పిల్లలకు తెలియపరిచేవారు. చాలా సులభమైన భాషలో పిల్లలకు అర్థమయ్యేలా బుజ్జి బుజ్జి సంబోధనలతో కథలు చెప్పి పిల్లలను ఆకట్టుకునే వారు. తమతో ఉన్న పిల్లలను శీలవంతులుగా, వివేచనాపరులుగా తీర్చిదిద్దుతుండేవారు. ఎలాంటి సమస్య వచ్చినా పిల్లలు తాతయ్య నాయనమ్మ వద్దే వెల్లబుచ్చుకొనే వారు. వారి మాట ప్రకారం నడిచి మనసును తేలిక చేసుకొనేవారు. ఆ రోజులు ఇప్పుడు లేవు. ఆ లోటును తీర్చే బాధ్యత ఇప్పుడు బాలసాహిత్య రచయితల మీద పడింది. ఆ బాధ్యతను బాధ్యతాయుతంగా తీసుకొని కొందరు రచనలు చేస్తున్నారు. వేళ్ళ మీద లెక్కింపదగిన ఆ కొందరు బాలసాహితీవేత్తల్లో పైడిమర్రి రామకృష్ణ తొలి వరుసలో ఉంటారు. ఆయన కలం నుంచి జాలువారిన కథల సంపుటే 'గుడ్డేలుగు బల్గం'.
ఇందులో ఒకటి తక్కువ ముప్పై కథలున్నాయి. కథలన్నీ వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అక్షరాలు, గుణింతాలు వస్తే చాలు పిల్లలు సొంతంగా చదువుకునే స్థాయిలో ఉన్నాయి. చాలా సరళమైన భాషను రచయిత ఉపయోగించారు. ఆయన ఏ కథ రాసినా సులభశైలిలో ఉంటుంది. బుజ్జి బుజ్జి వాక్యాలతో బుజ్జి బుజ్జి ఊహలతో బుజ్జి బుజ్జి పిల్లలకు కథలను అందివ్వగలుగుతున్నారు. 'గుడ్డేలుగు బల్గం' కథల సంపుటి చదివిన వారికందరికీ అది అనుభవైకవేద్యం కాగలదు.
ఇందులోని మొదటి కథ 'మృగరాజు సలహా' నీటి కొరతను అధిగమించే మార్గం తెలియజెప్పే పర్యావరణ కథ. రెండో కథ 'కొత్త నైపుణ్యం'లో ఒక సంక్లిష్ట అంశాన్ని రచయిత అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు అందించారు. సహజంగా మనలో ఉన్న నైపుణ్యానికి తోడుగా మరిన్ని కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటే మనకు అవి గౌరవం తెచ్చి పెట్టేవి అవుతాయని సందేశమిచ్చారు. మూడవ కథ 'గుడ్డేలుగు బల్గం' తెలంగాణ మాండలికంలో రాసిన కథ. కథా వస్తువు ఆసక్తిదాయకంగా ఉండడం వల్ల మాండలికం ఇతర ప్రాంతాల పాఠకులను ఇబ్బంది పెట్టదు. ఎలుగుబంటిని తెలంగాణాలో గుడ్డేలుగు అని పిలుస్తారు. ఈ కథలో ప్రజాభిమానం చూరగొనడానికి సేవే గొప్ప సాధనమని చెప్పడం జరిగింది. ఈ సందేశం పిల్లలను మంచి నాయకులుగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుంది. నాల్గో కథ 'ఆచరణ లేని జ్ఞానం'లో ఆచరణ లేని జ్ఞానం విలువ లేనిదని ఆచరణలోకి తెచ్చినప్పుడే తెలుసుకున్న జ్ఞానానికి సార్ధకత కాగలదని చెప్పారు. ఐదవ కథ 'అసలైన అన్నదాత'. ఈ కథ 'అతిథులంటే ఒక్క మనుషులే కాదు జంతువులు పక్షులు కూడా అని తెలియపరిచి మూగజీవాలను ఆదరించండ'ని ప్రబోధించింది.
ఈ పుస్తకంలోని ప్రతి కథా ఆణిముత్యంలాంటి సందేశమిచ్చేదిగా ఉంది. 'ఒంటరి కోతి' కథ కని కల్ల నిజం తెలుసుకోవాలని తెలియపరిచే కథ. 'పులి గుట్ట' ధైర్యే సాహసే లక్ష్మీ అనే సుభాషితాన్ని వినిపిస్తోంది. 'కొంగ బిడ్డ పుట్టిన రోజు' అనే కథ లేని వాడి ఆడంబరం అప్పునే మిగుల్చుతుందన్న జీవిత సత్యం చెబుతుంది. 'లోకజ్ఞానం' కథ పిల్లల పెంపకం మీద రాసిన కథ.బయట ప్రపంచం చూడకుండా పిల్లలు పెరిగితే ఎలాంటి దుష్పరిణామానికి దారి తీస్తుందో తెలియపరుస్తుంది. 'హృదయానందం' కథ అవసరం కలిగిన వారికి సాయం చేయడమే గొప్ప అన్న నీతిని తెలుపుతుంది. 'బుజ్జి ఏనుగు బుల్లి కోతి' కథ చెట్లు ప్రాముఖ్యత చెబుతుంది. 'మంచిపని' అనే కథ చెడ్డ పనులు స్నేహాన్ని దూరం చేస్తాయి. మంచి పనులు స్నేహితులను ఎక్కువ చేస్తాయి అని బోధిస్తుంది. ఇలా ప్రతి కథ పిల్లలకు మంచిని బోధిస్తూనే వారిని మంచి పాఠకులుగా మారుస్తుంది. పిల్లలు మంచి పాఠకులుగా ఎదిగితే మన మాతృభాషకు కావలిసింది ఏముంది? జీవనది లాగ మన తెలుగు మారుతోంది కదా! ఇకపోతే రచయిత రామకృష్ణ గారికి నాదొక సలహా. సులభ శైలిని అలవర్చుకున్న రామకృష్ణ గారు పన్నెండేళ్ళ లోపు పిల్లలకే రాసి తృప్తి పడకుండా కౌమార దశలోని పిల్లలకు కూడా రాసి తెలుగు పిల్లలకు తెలుగు బాలసాహిత్యానికి మేలు చేయాలి.
- బెలగాం భీమేశ్వరరావు 99895 37835










