ఆందోళనయే ఊపిరిగా
మహిళా శక్తికి మారుపేరు
పీడితుల పక్షాన నిలిచి
ప్రజల కోసమే బతికిన వీరనారి
మూడు తరాలకు ప్రేరణగా
పోరాటమే ఊపిరిగా
జీవితమే ఆందోళనగా
పీడితుల కోసం ఆనాడు
నిజాం నిరంకుశ పాలనను
రజాకార్ల దాష్టీకాలను చెండాడగ
బందూకు పట్టిన తెలుగు ఆడబిడ్డ
గిరిజన మహిళల్లో
చైతన్య జ్వాలల్ని రగిలించి
సాయుధ పోరాట ఝాన్సీవై
దళాలను ఎర్ర దండులా
నడిపిన కమాండర్ నీవు
ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో
మహిళా ప్రతినిధిగా
మచ్చలేని నాయకుడు సుందరయ్య
అడుగు జాడల్లో నీ వాణిని
నలుచెరగులా వినిపించిన ధీశాలివి
నేడు పిడికిలెత్తి అన్యాయాలపై
గళమెత్తిన యోధురాలివి
పుట్టింది ఎక్కడైనా
బతుకును మాత్రం బడుగుల కోసం
ధారపోసిన త్యాగశీలివి
తెరచిన నీ బతుకు పుస్తకం
'నా మాటే తుపాకి తూటా'
అణచివేతను అన్యాయాలను
ధిక్కరించే మహిళా శక్తికి వేగుచుక్క
ఎరుపెక్కిన పాటలా
ఎగురుతున్న అరుణ పతాకంలా
ఎత్తిన పిడికిలిగా లోకాన
నీ చరిత సదా నిలిచేనులే!
- డా. కె. దివాకరాచారి, అట్లాంటా, యుఎస్
93910 18972










