Mar 14,2022 07:13

'వెండి మేఘం' అన్న పేరులో మనకు ఓ భావుకత కనిపిస్తుంది. కానీ ఇది భావుకతతో కూడిన నవల కాదు. ఓ దిగువ మధ్య తరగతి ముస్లిం వ్యవస్థ గురించిన కథ. అది కూడా స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో జరిగిన కథనే నవలగా మలిచారు. ఈ నవల చదువుతుంటే కళ్లముందు దృశ్యాలు సజీవంగా కదులుతున్న భావన కలుగుతుంది. ఈ 'వెండి మేఘం' నవలలో ముస్లిం తెగల మూలాలను, వారి జీవన విధానాన్ని, సంప్రదాయాలను, కొన్ని కుటుంబాల కటిక పేదరికాన్ని మన కళ్ల ముందుంచిన తీరుకు నవలా రచయిత సలీం గారికి అభివాదాలు. ఈ నవల వచ్చి చాలాకాలమే అయినప్పటికీ- పరిస్థితుల రీత్యా ఇప్పటికీ అందరం చదివి చర్చించాల్సిన రచన ఇది.
    చదువులేని ఓ స్త్రీ ఎంత ఆత్మవిశ్వాసంతో బతుకుతుందో రచయిత చూపించిన తీరు చూస్తే ప్రతి స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. ఈ నవల రచయిత సలీం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. ఇప్పటికి 27 నవలలు, కథా సంపుటాలు, కవితల సంపుటాలు వెలువరించారు. అనేక గౌరవప్రదమైన సాహితీ పురస్కారాలు పొందారు. మన సమాజంలో ముస్లిముల పట్ల ఉన్న ఎన్నో అనుమానాలకు ఈ నవల సమాధానం చూపిస్తుంది. అక్కడ జరిగే బాల్య వివాహాలు, బహు భార్యత్వం, అవిద్య, ఆ మతంలోని ఇతర తెగల గురించి ఎన్నో విషయాలను ఆర్ద్రంగా అక్షరీకరించారు రచయిత.
       ఈ నవలలో ముస్లిం మతంలోని తెగల గురించి ముఖ్యంగా దూదేకుల గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి వెళ్లిన వారే దూదేకులు. వారికి మాట్లాడేందుకు ఉర్దూ రాదు, నమాజ్‌ చేయడం రాదు, హిందూ దేవుళ్లను పూజిస్తారు. ఈ కారణాలతో ముస్లిములు వాళ్లను పూర్తిగా దూరంగా ఉంచుతారు. వారు దూది ఏకుతారని దూదేకులని, పింజారీలని, లద్దీఫ్‌లని పిలుస్తారు. పరాయి మతం వాళ్లు చిన్నచూపు చూడడం కన్నా తమ మతంలోని వాళ్లే తమని అలా తక్కువ చేసి చూడడం వారిని ఆత్మన్యూనతకు గురిచేస్తుంది. ఈ నవల ప్రస్తుతం తెలంగాణలోని నాలుగు యూనివర్సిటీలలో ఎం.ఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంది.
       ఈ నవలలో ఒక ధీరోదాత్తమైన క్యారెక్టర్‌ను పరిచయం చేస్తారు రచయిత. ఆత్మస్థైర్యం కలిగిన ఒక మహిళ పాత్ర అది. ఆమె పేరే అన్వర్‌. 'అన్వర్‌' పదకొండేళ్ల అందమైన అమ్మాయి. అక్క కొడుకు బారసాలకు చినగంజాం నుండి త్రోవగుంటకు వస్తుంది. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అన్వర్‌ తల్లితండ్రులకు ఐదవ సంతానం. అక్క సలీమున్‌ తరువాత ముగ్గురు అన్నలు ఆమెకు. పాఠశాలకు వెళ్లి చదువుకోకున్నా ఇంట్లోనే ఉర్దూ నేర్చుకుంటుంది. పసితనపు పరిమళం వదలని బంగారు బాల్యంలోనే ఉంది ఆమె వయసు. అన్వర్‌ అన్నలు కూడా పెద్దగా చదువుకోరు. తండ్రి బ్రిటిష్‌ వాళ్ల దగ్గర ప్యూన్‌గా పని చేస్తుంటాడు. సలీమున్‌ భర్త భాషా కూడా విద్య లేనివాడే. పొగాకు కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తుంటాడు. తాగుబోతు, తిరుగుబోతు, అనుమాన పిశాచి. కానీ అతని తల్లి కుల్సుంబి ఉత్తమురాలు. సలీమున్‌ తన కొడుకు బారసాల రోజు రాత్రే తేలుకుట్టి మరణిస్తుంది.
       ఏడాది గడవకముందే భాషాకు రెండవ భార్యగా అన్వర్‌ వెళ్తుంది. పసితనం.. పెళ్ళి అంటే ఏంటో కూడా తెలియని వయసు ఆమెది. అక్క కొడుక్కి తాను అమ్మ అవ్వాలి అని మాత్రమే తెలుసు. అక్క కొడుకు రఫీ అంటే ఎంతో ప్రేమ. అన్వర్‌ని అమ్మ అని పిలిచేవాడు. ఈ ముచ్చట కూడా ఎంతోకాలం నిలువలేదు. అన్వర్‌కు ఒక బాబు పుడుతూనే తండ్రి చెప్పుడు మాటలు విని పిన్నిని ద్వేషించడం మొదలు పెడతాడు రఫీ. అన్వర్‌ తన కొడుకు జిలానీతో పాటుగా రఫీని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది.
     ఇక్కడ నజీర్‌ గురించి చెప్పాలి. నజీర్‌ అన్వర్‌కు మామ కొడుకు. వాళ్లు పుట్టినప్పుడే పెద్దలు వాళ్ల పెళ్లి గురించి మాట్లాడుకునేవారు. నజీర్‌కు అన్వర్‌ అంటే చాలా ఇష్టం. ఆమెకంటే ఇరవై ఐదేండ్లు పెద్దవాడైన భాషాకు ఇచ్చి అన్వర్‌ వివాహం చేయడం నజీర్‌కు ఇష్టం లేదు. ఒకసారి అన్వర్‌ను చూడాలని త్రోవగుంటకు వస్తాడు. కుల్సుంబి ఎంతో ప్రేమగా మాట్లాడి మర్యాదలు చేసినా.. అనుమానస్తుడైన భాషా ఇద్దరినీ దుర్భాషలాడి నజీర్‌ను కొట్టి పంపుతాడు. ఈ సంఘటనతో అత్తాకోడళ్లు ఇరువురూ పూర్తిగా కుంగిపోతారు. కుల్సుంబికి అన్వర్‌ అంటే చాలా అభిమానం. అత్తాకోడళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు.
       ఆ ఊరిలోనే ఉంటున్న ఆదాం, భాషా కోసం వస్తూ పోతూ, అన్వర్‌ను అక్కా అని పిలుస్తూ ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉంటాడు. అతనికి తమ కులం వారైన దూదేకులను ముస్లిములు తక్కువగా చూడడం బాధ కలిగిస్తుంది. ఈ కారణంతోనే ఆదాం, అన్వర్‌ దగ్గర ఉర్దూ నేర్చుకుంటాడు. తమ దూదేకుల హక్కుల కోసం పోరాడాలని, సమాజంలో గౌరవంగా, ఆర్థికంగా నిలబడాలంటే చదువు ముఖ్యమని, కేవలం ఉర్దూ నేర్చుకుంటే చాలదని, ఉద్యోగం చేయాలంటే ప్రాంతీయ భాషైన తెలుగు రావాలని, దానికోసం అందరూ బడికి వెళ్లాలని అన్వర్‌ ద్వారా తెలుసుకుంటాడు. ఆ ఊర్లోని ముస్లిములు ఎవరూ తమ పిల్లలను బడికి పంపరు. మొదటిసారి అన్వర్‌ రఫీని బడిలో చేరుస్తుంది. ఆరోజు ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇలా ఉండగా ఆదాం అక్కను ఒకరోజు భాషా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు. ఆరోజు నుండి కుల్సుంబి అన్వర్‌, జిలానీలతో కలిసి వంటగదిలోనే వేరుగా ఉంటుంది. మసీదు మాన్యం ఐదెకరాలు కౌలుకిచ్చి ఆ డబ్బుతో కుటుంబాన్ని భారంగా గడుపుతుంటారు. కొద్దిరోజుల్లోనే భాషా క్షయవ్యాధితో మరణిస్తాడు.
      ఇల్లు గడవడం చాలా కష్టమైపోతుంది. అన్వర్‌ తన అత్త అనుమతితో ఊరికి వెలుపల ఉన్న పొగాకు కంపెనీలో పనికి చేరుతుంది. అది ముస్లిం వాడలో ఎవరికీ ఇష్టం ఉండదు. ముస్లిం మహిళలు అలా బయటకు వెళ్లకూడదని కావాలంటే ఆమెను ఇంకో పెళ్లి చేసుకోమని అంటారు. తన జీవితాన్ని ఎలా గడపాలో తనకు తెలుసని, ఉద్యోగం చేయడం తన కుటుంబానికి ఇప్పుడు చాలా అవసరం అని చెప్తుంది. అన్వర్‌ అంతటితో ఆగకుండా ఆ ఊరిలోని పంతులు దగ్గర సాయంత్రం పూట చదువు నేర్చుకుంటుంది. ఆర్థికంగా నిలబడాలంటే తాము ఇంకా కష్టపడాలని కౌలుకి ఇచ్చిన తమ పొలాలను వెంకారెడ్డి దగ్గర నుండి తీసుకుని తానే వ్యవసాయం చేయడం ప్రారంభిస్తుంది. తనకు సహాయంగా ఆదాం, ఆదెమ్మ, కుల్సుంబి ఉంటారు.
        ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం పొందిన నజీర్‌ ఒంగోలుకు బదిలీ చేయించుకుని త్రోవగుంటకు వస్తాడు. ఆమె ఒంటరితనంపై ఆ ముస్లింవాడలో అందరికీ అనుమానమే. అంచెలంచెలుగా ఎదుగుతున్న ఆమె ఆర్థికస్థితిని చూసి ఓర్వలేక ఎప్పుడూ ఏదో ఒక నింద వేస్తూనే ఉంటారు. కుల్సుంబి అందరి నోటికి తాళం వేయాలని అన్వర్‌తో నజీర్‌ను వివాహమాడమని చెబుతుంది. నజీర్‌ కూడా అందుకు సమ్మతంగానే ఉంటాడు. కానీ అన్వర్‌ ఒప్పుకోదు. తన దృష్టంతా ఇప్పుడు తన పిల్లల చదువు గురించే అని, ఇంకో మనువు చేసుకునే ప్రసక్తే లేదని కచ్చితంగా చెబుతుంది. తన మిత్రురాలితో నజీర్‌ వివాహం దగ్గరుండి జరిపిస్తుంది. బాల్యంలోనే వివాహం.. యుక్త వయసులోనే వైధవ్యం.. అయినా అన్వర్‌ కుంగిపోలేదు. బతుకుతో పోరాడింది. కష్టపడి చదివి పియుసి పాసవుతుంది. కుల్సుంబి వార్ధక్యంతో మరణిస్తుంది. అప్పటికే రఫీకి పెళ్లయి పిల్లలు కూడా పుడతారు. అన్వర్‌ తాను పనిచేసే పొగాకు కంపెనీలోనే సూపర్‌ వైజర్‌గా ప్రమోషన్‌ పొందుతుంది. రఫీ, అతడి భార్య ఇద్దరూ ఆమెను బాగా అవమానించేలా మాట్లాడి ఆమె నుండి మసీదు మాన్యం ఐదెకరాలు తీసుకుంటారు. అయినా కుంగిపోకుండా కౌలుకు వ్యవసాయం చేసి పొలం కొంటుంది.
     ఆదాం తమ దూదేకుల కులం హక్కుల కోసం పోరాడి విజయం సాధిస్తాడు. దూదేకులను నూర్‌ భాషీయులుగా గౌరవంగా పిలవాలని, బాగా వెనుకబడిన తమ కులం వారికి బిసిలలో చోటుదక్కేలా చేసి అందరి మన్ననలను పొందుతాడు. ఈ విజయం తనది కాదని అన్వర్‌దని సభలో చెప్తాడు. అన్వర్‌ కొడుకు జిలానీ ఎం.ఎ. పాసై, బ్యాంక్‌ పరీక్షలు రాసి హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంకులో ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ అన్వర్‌ త్రోవగుంటను వదిలి రానంటుంది. అక్కడ తమ వాడలోని ఎంతోమంది పిల్లలకు సాయంత్రం పూట చదువు నేర్పుతుంది. ముస్లిం మతంలోని పేదరికం, మూఢ నమ్మకాలు సమసిపోవాలంటే చదువు చాలా ముఖ్యమని ఆమె నమ్మకం.
        అన్వర్‌ తన కొడుకు, కోడలు, మనుమలను చూడాలని ఒకసారి రైల్లో హైదరాబాద్‌ వెళ్తుంది. సరిగ్గా ఆ సమయంలోనే కర్ఫ్యూలో చిక్కుకుంటుంది. చార్మినార్‌ దగ్గర జరిగిన హిందూ ముస్లిం గొడవలు చాలా పెద్దవై హింసాత్మకంగా మారతాయి. ఈ సంఘటనలన్నీ చూసిన అన్వర్‌ కుంగిపోతుంది. మతం ప్రేమను కదా ప్రబోధిస్తుంది.. మతం వల్ల సహనం కదా అలవడాలి.. అనుకుని ఎంతో బాధ పడుతుంది. ఈ మతహింసలు ఏ కారణం వల్ల జరుగుతాయో కొడుకు వల్ల తెలుసుకుని ఇంకా ఆశ్చర్యపోతుంది.
      అన్వర్‌ బాగా పెద్ద వయసులోకి వచ్చినా త్రోవగుంటలోనే ఉంటుంది. జిలానీ కుటుంబ సమేతంగా తమ గ్రామం వెళతాడు. అక్కడ జిలానీ కూతురు కుల్సుం నానమ్మతో తాను లాయర్‌ అవుతానని ముస్లిం మహిళల హక్కుల కోసం పోరాడాలని ఉందని చెప్తుంది. ఆ మాటలు విని ఎంతో పొంగిపోతుంది అన్వర్‌. 'ఏ స్త్రీ అయినా సొంత వ్యక్తిత్వం, ఆత్మ గౌరవంతో బతకాలి. ఈ రెండూ సాధించాలంటే పోరాడాలి' అంటున్న అన్వర్‌ స్త్రీల ఆత్మ గౌరవాలకు ప్రతీక లాంటిది. ఇంకా ఈ నవలలో అనేక పాత్రలున్నాయి. అనేక సంఘటనలున్నాయి. అవి మనల్ని కదిలిస్తాయి, ఆలోచింపజేస్తాయి, ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ చదవాల్సిన మంచి నవల ఇది.
                                                                            - శాంతికృష్ణ         95022 36670