Mar 21,2022 07:21

కవిత్వం ఒక గొప్ప ప్రక్రియ. దాని రహస్యం, కవిత్వంలోని మాధుర్యం కవితా ప్రియులకే తెలుసు. 'కాళిదాసుకి తెలుసు, కవికి తెలుసు, కష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు, గుర్రం జాషువాకి తెలుసు' అన్నారు ఓ ప్రముఖ కవి. కత్తి కన్నా కలం గొప్పది. కవిత్వం రాయడం అంటే ఖడ్గంతో సహజీవనం చెయ్యడమే. కవిత్వానికి మరణం లేదు, అంటే రైతు పొలం పండించినంతకాలం కవి కవిత్వం రాస్తూనే ఉంటాడు. కవిత్వం రాయాలనుకునే వారికి ముందుగా స్పందించే హృదయం ఉండాలి. కవిత్వం రాయాలంటే తేలికైన వ్యవహారిక పదాలతో భావవ్యక్తీకరణ చెయ్యగలగాలి. చెప్పదలుచుకున్న భావం సుస్పష్టంగా, ముక్కుసూటిగా చెప్పగలగాలి. ఇంకా చక్కనైన తక్కువ పదాలతో కవిత్వం రాయగలగాలి. అంటే మనం అనుకున్న భావాన్ని సాధ్యమైనంత క్లుప్తంగా చెప్పగలగాలి. మానవ సంబంధాలు కనుమరుగవుతున్న నేటి తరుణంలో కవులు ఎంతో గొప్పగా బంధాలు అనుబంధాలపైనా, సమకాలిక అంశాలపైనా చక్కని కవితలల్లి వాటిని దగ్గర చేస్తున్నారనే చెప్పాలి.

హృదయం నుంచి స్పందించి చక్కని భావాలని అందించడం కూడా కవిత్వమే. ఇలా తన హృదయంలో కలిగిన భావాలు, సమాజంలో జరిగిన సంఘటనలు, ప్రకృతిపై ఉన్న ప్రేమ, దేశభక్తి, కుటుంబ బంధాలు, ఇంకా స్వీయ అనుభవాలూ .. అన్నీ కవితా వస్తువులే అవుతాయి. కవి స్పందించి ఈ స్పందనకు అనుగుణంగా చక్కని పద బంధాలతో భావాలను అల్లడమే కవి యొక్క గొప్పతనం. కవి తన మనసులో కలిగిన ద్ణుఖాలని, బాధలను దాచుకోకుండా కవిత్వ రూపంలో వెల్లడించి తన మనసులో భారాన్ని దించుకోవడం ఓ సాహిత్య ప్రసవ ప్రక్రియగా చెప్పొచ్చు.

మొట్టమొదట వచన పద్యం, వచన గేయంగా పిలువబడేది. వ్యావహారిక శైలిలో సులభమైన పదాలతో వచన కవిత్వాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో రాస్తున్నారు కవులు. వచన కవితా పితామహులు కుందుర్తి ఆంజనేయులు 'పాతకాలం పద్యం అయితే వర్తమానం వచన గేయం'అన్నారు. వచన కవిత్వ లక్షణం నిరాడంబరత, మొదటి నుంచి చివరి వరకు వ్యవహారిక భాషలో రాయడంతో ఆ కవితకే అందం వస్తుంది. కవిత రాసేటప్పుడు శీర్షిక ముఖ్యం. శీర్షికకు సంబంధించిన అంశం మొదటి నాలుగు వాక్యాలలోపు రాయాలి. కవిత చదివేకొద్దీ ఆసక్తిదాయకంగా ఉంటే ఆ కవిత ఆసాంతం చదవాలనిపిస్తుంది. కవితలో ప్రతి వాక్యం కూడా ఆలోచనాత్మకంగా ఉండేటట్లు మలచాలి. అప్పుడే పాఠకుడిలో ఉత్సుకత పెరిగి మంచి స్పందన వస్తుంది.

చెప్పదలుచుకున్న అంశం కవి పాఠకులతో ఆత్మీయంగా మాట్లాడినట్లు ఉండాలి. ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు ప్రముఖ రాజకీయవేత్త జయప్రకాష్‌ నారాయణ గారిపై ఎంత అద్భుతంగా కవిత అల్లారో చూడండి. 'పుట్టుక నీది/చావు నీది/ బతుకంతా/ దేశానిది'. మరో కవితలో వాక్యం చూడండి : 'అక్షర రూపం దాల్చిన/ ఒక సిరా చుక్క/ వెయ్యి మెదళ్లకి కలయిక. ఈ కవిత ఎంత అద్భుతంగా ఉందో చూడండి : 'అన్నపు రాశులక చోట/ ఆకలి మంటలకచోట/ సంపదలన్నీ ఒక చోట/ గంపెడు బలగమొక చోట.- కాళోజి. అలాగే శ్రీశ్రీ కవిత్వంలో కూడా ఎంత నిగుడార్థం దాగి ఉందో చూడండి. 'కుదిరితే పరిగెత్తు/ లేకపోతే నడు/ అది చేతకాక పోతే పాకుతూ పో. ఈ కొటేషన్స్‌లాంటి కవితలు చూడండి 'నువ్వు పడుకునే పరుపు/ నిన్ను చెదిరించుకోకముందే/ నీ బద్దకాన్ని/ వదిలేరు. 'నీ అద్దం నిన్ను/ ప్రశ్నించక ముందే/ సమాధానం/ వెతుక్కో - శ్రీశ్రీ. అలాగే గుర్రం జాషువా గారి కవిత్వం కొటేషన్స్‌ చాలా అద్భుతంగా ఉన్నాయి. 'వడగాల్పు నా జీవితమైతే/ వెన్నెల నా కవిత్వం. మహిళాభ్యుదయ చింతన గురించి మరో కవిత 'అబల విద్యా పూర్ణయై/ తోడు రాకున్ననే/ దేశము నిద్ర మేల్కనునే/ 'లోక మోహన సబర్మతి/ సన్మునికి కుమారుడను/ మహాత్ముని చెప్పుల/ జాడలోన/ కాలాడ చరింతును. ఈ కవితలో జాషువా గాంధీని కొనియాడారు.

కవిత్వం అనేది ప్రతిభ వల్ల, అభ్యాసం వల్ల, పరిసరాల అధ్యయనం వల్ల, పఠనం వల్ల వస్తుంది. పాత, కొత్త కథల పుస్తకాలు చదువుతూ వారి కవిత్వంలోని మాధుర్యాన్ని ఆకళింపు చేసుకుంటే మనకు మరిన్ని సరికొత్త ఆలోచనలు వస్తాయి. ఈ సరికొత్త ఆలోచనల ప్రభావమే ఇప్పుడు కవిత్వంలో అనేక సరికొత్త ప్రక్రియలు వచ్చాయి. నానీలు, మినీ కవితలు, హైకూలు, మొగ్గలు, రెక్కలు, రవ్వలు, న్యూమరిక్కులు ... ఇలా అనేక ప్రక్రియలతో కవులు నూతన ఒరవడికి భాష్యం చెబుతూ సాహితీ పూతోటని ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు.

'నాలుగు తుపాకులకంటే మనకి వ్యతిరేకంగా రాసే ఒక వార్తాపత్రికకి భయపడాలి' అంటారు నెపోలియన్‌. అంటే దీనిని బట్టి మనం కవిత్వానికున్న బలం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇలా కవులంతా తమ కవితా ఝరులతో నిద్రపోతున్న సమాజాన్ని తట్టి లేపుతూ ఈ సమాజాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతూ ప్రభుత్వాలకి కూడా చక్కని సలహాలు సూచనలు కవితల రూపంలో తెలియజేస్తూ అందర్నీ ఇన్స్పైర్‌ చేస్తున్న కవయిత్రులు/ కవి మిత్రులందరికీ ప్రపంచ కవితా దినోత్సవం శుభాకాంక్షలు.

(నేడు ప్రపంచ కవితా దినోత్సవం)

- పింగళి భాగ్యలక్ష్మి
97047 25609