వీర వనితకు అక్షర నివాళి
నల్గొండ జిల్లా
విప్లవాల ఖిల్లా
దానికి తుంగతుర్తి పునాది రాయి
ఆ నీళ్ళల్లో చైతన్య బీజాలు
కర్విరాల కొత్తగూడెంలో
భూస్వామ్య కుటుంబంలో పుట్టిన స్వరాజ్యమా!!
అన్న బి ఎన్ అడుగుజాడల్లో ఇంటి నుండి పోరు
జీతగాళ్ళ కి అండగా
తెలంగాణా సాయుధ పోరులో
తుపాకీ పట్టి అజ్ఞాతంలో
ఉద్యమ సహచరుని తో నే కలిసి నడచిన ధీరురాలా!!
నీ కంఠం కంచు కంఠం
అది పాటైనా ప్రసంగమైనా అనర్గళంగా
నీ స్వంత బాణీలో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన కంఠం మూగబోయిందా!!
ఆడంబరాల్లేని పెళ్ళి
పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ లో
కమ్యూనిస్టు ఉద్దండుల సమక్షంలో
వామ పక్ష ఐక్యత నీ ఆకాంక్ష
నెరవేరకుండానే నిష్క్రమిస్తివా
గోదావరి నీళ్ళ కోసం చట్ట సభల్లో నీ వాణి
సుందరయ్య కి తోడుగా 1978 అసెంబ్లీ ల
మహిళా సమస్యలపై ఎడతెగని పోరు
దూబగుంట రోశమ్మ కి అండగా రాష్ట్ర మంతా
సారా మహౌద్యమం లో నీ పాత్ర మరువం కామ్రేడా!
సూర్యాపేట చుట్టు ముట్టూ
గుట్టలన్నీ ఒర్రెలన్నీ వాగులన్నీ
కంట తడి పెడుతున్నాయి
బాలెంల వాగులో చేపలు నిన్ను చూడాలని ఒడ్డుకి వచ్చారు కామ్రేడా
దురాజ్ పల్లి గుట్టల్లో కుందేళ్ళకి పోరాటం నేర్పితివా కామ్రేడా
చిన నెమిల పెద నెమిల ఏపూరు చిట్టడవుల్లో
నీ తుపాకీ శబ్దం ఇంకా ప్రతిధ్వనిస్తుంది
ఎర్రబాడు దొరలకు ఎరుపు శక్తి ఏంటో
చూయించిన స్వరాజ్యమా!! జోహార్లు
కడ దాకా కమ్యూనిస్ట్ గా
ఆస్తులు వదిలి పంచి
రాజకీయాల్లోకి వచ్చిన నిన్నటి తరంలో నువ్వు
మా మోదుగు పువ్వు వి కామ్రేడా !!
నీ అడుగుజాడల్లో మేమూ!! ఎర్ర బాటలో తలవంచక
- గిరి ప్రసాద్ చెలమల్లు










