Apr 19,2023 21:33

ఫొటో : ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డితో మాట్లాడుతున్న రైతుసంఘం నాయకులు

హైలెవెల్‌ కెనాల్‌ పనులు పూర్తి చేయాలి
- ఎంఎల్‌ఎకు వినతిపత్రం అందజేసిన ఎపి రైతుసంఘం
ప్రజాశక్తి-మర్రిపాడు : సోమశిల హై లెవెల్‌ కెనాల్‌ పనులు పూర్తి చేయాలని గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో తిరుగుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డికి బుధవారం ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య వినతి పత్రం అందజేశారు. హైలెవెల్‌ కెనాల్‌ పనులు చేపట్టి దాదాపు 12ఏళ్లు పూర్తయిందని కానీ ఇప్పటికీ రూపురేఖలు లేవన్నారు. గత ప్రభుత్వం హయాంలో కొన్ని పనులు చేయగా ప్రభుత్వం మారడంతో హైలెవెల్‌ కెనాల్‌ పనులు మందకొడిగా సాగుతున్నాయన్నారు. పైపులైన్లు, పంపుషెడ్లు నిర్మించారని రోజులు గడిచే కొద్ది అవి తుప్పు పట్టే ప్రమాదం ఉందన్నారు. ప్రాజెక్ట్‌లో భాగమైన మొదటి రిజర్వాయర్‌ పడమటి నాయుడు పల్లి దగ్గర కేతామన్నేరుపై నిర్మించాల్సి ఉండగా భూ సేకరణ, రిజర్వాయర్‌ పనులుఇప్పటికీ చేపట్టలేదన్నారు. వెంటనే పనులు చేపట్టాలని కోరారు.
రిజర్వాయర్‌ పనులు నత్త నడకన సాగుతుండడంతో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల నుండి వచ్చిన వరద నీరు రిజర్వాయర్‌లో చేరడంతోవచ్చిన నీరు వృథాగా సముద్రం పాలవుతుందన్నారు. హై లెవెల్‌ కెనాల్‌ పూర్తయి ఉంటే మెట్ట ప్రాంత ప్రజలకు సాగుత్రాగు నీరు అంది ఉండేదని, వలసలు నివారించ బడేవన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రహంతుల్లా, సిఐటియు మండల కార్యదర్శి రత్నయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంగినేని తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.