గడపగడపకు మనప్రభుత్వం
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని చుంచులూరు సచివాలయం పరిధిలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి నిర్వహించారు. స్థానికంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో రైతుల సౌలభ్యం కోసం రూ.21లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గ్రామంలో గడపగడపకు తిరిగి ప్రభుత్వం ప్రతి గడపకు అందచేసిన సంక్షేమ పథకాల వివరాలను లబ్ధిదారులకు తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిఒక్కరిని సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని కోరారు. గ్రామ పర్యటనలో హైలెవల్ కెనాల్ పనులు త్వరగా పూర్తి చేసేలా చూడాలని ఎంఎల్‌ఎ దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పనులు వేగవంతంగా జరిగేలా చూస్తామన్నారు. మంచినీటి సమస్యపై కొందరు గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే అధికారులను వేసవిలో నీటిసమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. గ్రామీణ స్థాయి నుంచే ప్రజలకు ఉపయోగపడేలా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లను ఏర్పాటు చేసిందని, తద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సత్వర వీలు కలుగుతుందన్నారు. గతంలో లాగా రైతులు ఇబ్బందులు పడుకుండా ఉండేందుకు వారి కోసం అన్ని విధాలుగా ఆలోచించి రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నారని, తద్వారా రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తుల దగ్గర నుండి ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాల పొందేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ సుబ్బిరెడ్డి, జెసిఎస్ కన్వీనర్ మోహన్ రెడ్డి, సర్పంచ్ చామంచయ్య, ప్రసాద్, వైసిపి నాయకులు ఇందూరు నర్సారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ జయరావు, రవి, బూదవాడ సర్పంచ్ మంచాల హరిబాబు, తెగలపాడు సర్పంచ్ చెవుల శ్రీనివాసులు, వైసిపి నాయకులు బేరి రామ్మోహన్ రెడ్డి, రామకృష్ణారెడి,్డ కృష్ణ ప్రసాద్‌రెడ్డి, సోషల్ మీడియా ఓంకారం శివ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.










